భారతదేశం నుంచి 2025 కల్లా క్షయ (టీబీ) వ్యాధిని నిర్మూలించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేటు రంగంతోపాటుగా సమాజం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలియో నిర్మూలనలో విజయం సాధించినట్లుగానే క్షయ వ్యాధిపైనా  లక్ష్యాలు పెట్టుకుని మరీ పోరాటాన్ని చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం జరిగిన ‘ఇంటర్నేషనల్ యూనియన్ అగెనెస్ట్ ట్యూబర్‌కులోసిస్, లంగ్ డిసీజెస్’ (ఐయూఏటీబీఎల్‌డీ) ఆధ్వర్యంలో నాలుగురోజుల పాటు జరగనున్న ‘ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. 2018లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 10% టీబీ వ్యాధిగ్రస్తులేనని పేర్కొన్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుండటమే దీనికి ప్రధాన కారణమన్నారు.


‘టీబీ హారేగా, దేశ్ జీతేగా’ (టీబీ ఓడుతుంది, దేశం గెలుస్తుంది) లాంటి ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ క్షయ వ్యాధిగ్రస్తులకు తక్కువ ధరలోనే సరైన వైద్యం అందించాలని ప్రైవేటు వైద్యరంగానికి ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ముందే వచ్చే ఐదేళ్లలోనే టీబీపై భారత్ విజయం సాధించడం లక్ష్యంగా పని చేయాలన్నారు. క్షయతోపాటుగా ఇతర ఊపిరిత్తుల వ్యాధుల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. 2025కల్లా ఈ మహమ్మారిని పారద్రోలాలని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారన్నారు. పేదరికం, జనాభా పెరగడం, జీవనశైలిలో మార్పుల కారణంగా సంక్రమిస్తున్న మధుమేహం తదితర వ్యాధులు క్షయవ్యాధి విస్తరణకు మూలకారణాలని ఆయన అన్నారు. ముందుగా ఇలాంటి వ్యాధులను నిర్మూలనకు కృషిచేయడం ద్వారా టీబీని నియంత్రించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా ఇప్పటికే జరుగుతున్న ప్రయత్నాల కారణంగా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయని.. రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్ఎన్‌టీసీపీ) కార్యక్రమం ద్వారా  భారత్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల రేటు 1.7% తగ్గిందని ఇది మరింతగా తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.



ప్రజలు, ప్రైవేటు రంగం సంయుక్తంగా పనిచేస్తూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం తక్కువ ధరలో అందేలా చొరవతీసుకోవాలని పునరుద్ఘాటించారు. ఇన్నొవేటివ్ మెడికల్ సైన్సెస్, బయోమెడికల్ రంగం పురోగతిలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు టీబీపై పరిశోధనలు, చికిత్స విధానాల అభివృద్ధి, టీబీ నిర్మూలన అంశాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. కేన్సర్, మధుమేహం, గుండెపోటు మొదలైన అసంక్రమిత (నాన్-కమ్యూనికేబుల్) వ్యాధుల కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని.. ఇందుకోసం ఆరోగ్యబీమా వంటి సదుపాయాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపైనా దృష్టి సారించాలన్నారు. తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల్లేకుండా.. సామాన్యులు కూడా సరైన వైద్యం పొందేందుకు వీలుంటుందన్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ ఈ దిశగా కేంద్రం చేపట్టిన చక్కని కార్యక్రమన్నారు.



ఈ పథకం ద్వారా 10కోట్ల కుటుంబాలకు సమగ్రమైన వైద్య బీమా అందుబాటులోకి వస్తుందన్నారు. కొంతకాలంగా వాయుకాలుష్యం కారణంగా శ్వాసకోస సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగిపోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్యంపైనా ప్రభుత్వాలు ప్రస్తుతం చేపడుతున్న చర్యలతోపాటు మరింతగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విషవాయువుల ఉద్గారాన్ని మరీ ముఖ్యంగా పీఎం 2.5 స్థాయిని తగ్గించేదిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్, కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, తెలంగాణ వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి  ఈటల రాజేందర్,  ఐయూఏటీబీఎల్‌డీ అధ్యక్షుడు డాక్టర్ జెరెమియ్య, ఉపాధ్యక్షుడు లూయిస్ కాస్ట్రో, టీఎఫ్‌సీసీఐ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, 130 దేశాల నుంచి వచ్చిన 400 మంది వైద్యులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డాక్టర్లు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: