మనిషి తన అవసరాలకు వాడి పడేసిన ప్రతివస్తువు తిరిగి ఏదోరకంగా మానవునికి ఉపయోగపడేదే. అందులో ఏ వస్తువైన కానీయండి. కాని వాడిపడేసిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. మిగతా వారి కంటికి అదోక పనికి రాని వస్తువుగానే మిగిలి పోతుంది. ఇకపోతే అందరు కామన్‌గా వంటింట్లో చేసేపని ఆమ్లెట్ వేసిన తర్వాత కోడిగుడ్డు పెంకులను చెత్తబుట్టలో వేయడం.


అలా ప్రపంచవ్యాప్తంగా కిచెన్ వ్యర్ధాలలో కోడిగుడ్డు పెంకుల వాటా లక్షలాది టన్నులుగా ఉంటుందట. మరి ఈ పెంకులు దేనికి ఊయోగ పడతాయంటే వీటితో మనిషికి కావలసిన కాల్షియం కార్బొనేట్‌ తయారవుతుందట. ఇది ఎముకల నిర్మాణంలో కీలకమైన పదార్ధం. అందుకే ఈ విషయం తెలిసినవారు కొందరు గుడ్డు పెంకును మెత్తగా నూరి కాల్షియం సప్లిమెంట్ కింద తీసుకుంటారు. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంది.


అదేమంటే గుడ్డు పెంకు ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఇకపోతే ఈ కోడి గుడ్డు పెంకులు దెబ్బ తిన్న ఎముకల రీజెనరేషన్ కోసం ఉపయోగపడుతాయని ఇటీవల  జరిగిన తాజా ప్రయోగాల ఫలితాలు చెబుతున్నాయి. ఈ ప్రయోగాన్ని యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్‌కి చెందిన శాస్త్రవేత్తలు  నిర్వహించారు. అంతే కాకుండా ప్రయోగ ఫలితాలను బయోమెటీరియల్ సైన్సెస్ జర్నల్‌లో కూడా ప్రచురించారు.


ఇక కోడిగుడ్డు పెంకులను శాస్త్రవేత్తలు మెత్తటి పొడిగా చేసి దానిని హైడ్రోజెల్ మిక్చర్‌కి కలిపారు. తద్వారా వచ్చిన జెల్ లాంటి పదార్ధం నుంచి ఎముకల కణజాలం ఉపయోగించి ఎముకలు రూపొందించారు. దీనిని విరిగిన ఎముకల స్థానంలో అతకవచ్చని వారు అంటున్నారు. ఎవరికైతే ఎముక అతకాలో వారి నుంచే ఎముక కణజాలం తీస్తారు కాబట్టి బయట తయారయిన ఎముకను శరీరం స్వీకరించే విషయంలో కూడా ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.


దీనికోసం ప్రయోగశాలలో మొదటి దశగా ఈ ప్రకియ అంతా చేసి చూశారు. ఆ తర్వాత ఎలుకలలో ప్రయోగించి చూశారు. ఇక ఇప్పుడు మనుషులలో ప్రయోగాలు చేయడమే తరువాయని శాస్త్రవేత్తల బృందం నాయకురాలు కామ్సి ఉనాల్ పేర్కొన్నారు. దీనికి పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశామనీ, ఈ ప్రయోగ ఫలితాలు మనుషులకు అందుబాటులోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందనీ ఆమె అంటున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఎముకలు నుజ్జు నుజ్జు అయిన వారికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: