దేశంలో ఆహార కల్తీ రాజ్యమేలుతోంది. త్రాచు పాములా ప్రజలపై బుసలు కొడుతోంది. తినే ప్రతీ ఆహారం విషతుల్యమై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బహిరంగ మార్కెట్లో లభ్య మవుతున్న కొన్ని పదార్థాల వల్ల ప్రజారోగ్యం కుంటుపడుతోంది. అంతేకాదు ఏదైనా అనారోగ్యానికి గురయినపుడు తీసుకునే ఔషధాలూ కల్తీమయమైపోతున్నాయి. కొందరు వ్యాపారులు.. అడ్డదారుల్లో సంపాదించాలనే కక్కుర్తితో ఈ మోసానికి ఒడిగడుతున్నారు. ఈ కల్తీ ముఠా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరించింది. 


ఆహార నియంత్రణ చట్టాల అమలు అంత గట్టిగా లేకపోవడంతో కల్తీ మాఫియా రెక్కలు కట్టుకొని విహరిస్తోంది. పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, త్రాగు నీరు, మాంసంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులు కల్తీ అయిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే ఆహారంలోనూ నాసిరకం పదార్థాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. పశువుల దాణాతో పాటు మందులనూ మాఫియా వదిలిపెట్టడం లేదు. దేశవ్యాప్తంగా 2018-19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఆహార పదార్థాల నమూనాల్లో 26వేలకు పైగా కల్తీలు ఉన్నట్టు బట్టబయలైంది. ఇందులో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. బీహార్, ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, మిజోరామ్ రాష్ట్రాల్లో అయితే పాల కల్తీ అధికంగా ఉంది. పాలల్లో డిటర్జంట్లు, యూరియాలు కలుపుతూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక తినుబండారాల్లో కల్తీ నూనెలు, వనస్పతీ వాడుతూ జనాల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. దీంతో అధికులు గండె, మూత్రపిండ సంబంధిత వ్యాధుల భారిన పడుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయకపోతే 2025నాటికి కేన్సర్ తో పాటు.. పలు ప్రమాదకర వ్యాధులను ఎదుర్కోక తప్పదని పలు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 


అనారోగ్యానికి గురయినపుడు వినియోగించే మందులలోనూ కల్తీ తాండవిస్తోంది. అధిక లాభాలు సంపాదించాలనే దురాశతో నాసిరకం మందులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 40శాతం మరణాలు మందుల్లో లోపం, కల్తీ ఆహారం వల్లే సంభవిస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చట్టాలు కఠినంగా ఉండటంతో ఆస్ట్రియా, డెన్మార్క్, ఫిన్ లాండ్, న్యూజిలాండ్  లాంటి దేశాల్లో అధిక శాతం కల్తీ ఆహారం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండటంతో కల్తీ కేటుగాళ్లకు తొందరగా శిక్షలు పడుతున్నాయి.  మనదేశంలోనూ కల్తీ మాఫియా ముఠా ఆటకట్టించాలంటే నిఘాతో పాటు.. కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: