రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.. ఇప్పటికే ఈ నెల 16 నాటికి  రాష్ట్రంలో 1,339 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 21 మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ విజృంభించకుండా  జాగ్రత్తలు తీసుకోవడం, బాధితులకు సమర్థంగా చికిత్సను అందించడంపై దృష్టిసారిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజారోగ్య సంచాలకుడు, స్వైన్‌ఫ్లూ నిరోధక సాంకేతిక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు వివరించారు.

 

 

ఇకపోతే వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో స్వైన్ ఫ్లూ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి తగిన వైద్య చికిత్సలు చేసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే రోజురోజుకూ ఈ మహమ్మారి విస్తరిస్తుండటంతో నగర వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే సాధారణ జలుబులో ఉండే లక్షణాలే స్వైన్ ఫ్లూకు ఉండటం గమనార్హం.

 

 

ఈ స్వైన్ ఫ్లూ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ సోకుతుంది. రోగులు దగ్గినప్పుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్లు పడిన చోట కూడా వైరస్ అంటుకొని ఉంటుంది. పొరపాటున అలాంటి వాటిని ముట్టుకున్న చేతితో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకుంటే ఇలాచేసిన వ్యక్తికి సోకుతుంది. ఇకపోతే ఇప్పటి వరకూ సగటున 1.6 శాతం మంది ఈ వ్యాధితో మృతిచెందినట్లు నిర్ధారించారు.

 

 

హైదరాబాద్‌లో 7,248 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయించగా.. 692 మందికి ఈ వ్యాధి సోకినట్లుగా,  ఏడుగురు మృతి చెందినట్లుగా నిర్దారించారు. ఇక నగర పరిసర ప్రాంతాలైన మేడ్చల్‌  జిల్లాలో 232 కేసులు, నమోదవ్వగా నలుగురు మరణించారట.. రంగారెడ్డి జిల్లాలో 215 కేసులు నమోదవ్వగా, ఇద్దరు మృతిచెందినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ వ్యాధివిషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: