'జలగ' అని పేరు చెప్తేనే మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అది ఒక్కసారి పట్టుకుందంటే.. అంత ఈజీగా వదలదు. పైగా, అది రక్తాన్ని జ్యూస్ పీల్చినట్లు పీల్చేసి కడుపు నింపుకుంటుంది. కానీ అది ఏకంగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి... చాలా భయానకంగా ఉంటుంది కదా..  ఈ ఘటన చైనాలోని లంగ్యాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రెండు జలగలను తన శరీరంలో 2 నెలలు పెంచుకున్నాడు. 


అదేంటి జలగలను పెంచుకోవటం ఏంటి.. అదేమన్నా సరదానా..? అని అనుకుంటున్నారా..? అతనేమీ సరదాగా పెంచుకోవటం లేదండి. అతడికి తెలియకుండా ఆ జలగలు అతని శరీరంలోకి చొరబడ్డాయి. ఒకటి ముక్కులో ఉంటే, మరొకటి నోట్లో కాపురం పెట్టాయి. ఇటీవల అతడు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడిన దగ్గు మాత్రం తగ్గడం లేదు.


ఇటీవల అతడు ఓ సారి దగ్గుతున్నప్పుడు రక్తం కూడా పడింది. దీంతో కంగారుపడిన అతను వైద్యుడిని సంప్రదించాడు. వైద్యులు అతడికి సీటీ స్కాన్ చేసి.. ఏమీ లేదని నిర్దారించారు. ఎండోస్కోపీ తరహాలో ‘బ్రోంకోస్కోపీ’ పరీక్ష జరిపారు. ఈ సందర్భంగా అతడి ముక్కులోని కుడి రంధ్రంలో ఒక జలగ, గొంతు వద్ద మరో జలగను కనుగొన్నారు ఆ డాక్టర్. అతడికి మత్తుమందు ఇచ్చి వాటిని విజయవంతంగా బయటకు తీశారు.


బయటికి తీసిన జలగలు ఇంకా బతికే ఉన్నాయని, ఇన్నాళ్లూ అతడి రక్తాన్ని పీల్చుకుంటూ గడిపేశాయని వైద్యులు తెలిపారు. బాధితుడు అటవీ ప్రాంతంలో పనిచేస్తుంటాడని, పర్వతాల నుంచి వచ్చే నీటిని తాగినప్పుడు జలగలు నూటిలోకి వెళ్లిపోయి ఉంటాయని తెలిపారు. అవి సూక్ష్మ రూపంలో ఉండటం వల్ల అతడి కంటికి కనిపించి ఉండవన్నారు. శరీరంలోకి చేరిన తర్వాత అవి అతడి రక్తాన్ని తాగుతూ పెరిగాయని తెలిపారు. చూశారుగా.. ఈ సారి నీటిని తాగుతున్నప్పుడు జాగ్రత్తగా తాగండి. ఏమైనా ఉంటె నాలకలే.. కదా అని లైట్ తీసుకోకండి సుమా...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: