మనిషి ఆరోగ్యం చాటున జరుగుతున్న దోపిడి అంతా ఇంతా కాదు. మందులని, డాక్టర్ల ఫీజులని దోచుకునే హస్పిటల్స్ ఉన్నాయి. మందుల షాపులు ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్బాల్లో పుస్తెల తాళ్లను అమ్ముకుని కూడా వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేసుకుంటున్న వారున్నారు. ఇకపోతే సాధారణంగా ఒక వ్యక్తికి తీవ్రమైన జబ్బుచేస్తే అతని కుటుంబంపై పడే ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. వైద్యులకు, వైద్య పరీక్షలకు, మందులకు వేలకు వేలు వెచ్చించాల్సి వస్తుంది.

 

 

ఇలాంటి సందర్భాల్లో ఒక్కొక్క సారి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చులో మందుల ఖర్చే ఎక్కువ. అందుకే మనదేశంలో జబ్బుచేసిన మనిషి కోలుకునే సరికి అతని ఇళ్లు గుళ్లవుతుంది.  అందువల్ల మందుల ధరలకు కళ్లెం వేయాలని ఎంతోకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న వారున్నారు. ఇక ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చబోతోంది. దీనివల్ల  దేశవ్యాప్తంగా మందుల ధరలు గణనీయంగా దిగిరానున్నాయి.

 

 

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు షెడ్యూలు జాబితాలో (నాన్‌-షెడ్యూల్డ్‌) లేని ఔషధాలపై 30 శాతం లాభాలతో సరిపెట్టుకుంటామని ఔషధ పరిశ్రమ తయారీదార్లు, పంపిణీదార్లు అంగీకారానికి రావటం వల్ల పేదలకు లబ్ది చేకురనుంది..  దీనివల్ల ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాల్లో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత వారంలో దిల్లీలో ఎన్‌పీపీఏ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తయారీదార్లు, పంపిణీదార్లు లాభాలు తగ్గించుకోవటానికి ఒప్పుకున్నారు.

 

 

ఇకపోతే దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తే మందుల ధరల తగ్గింపు అమల్లోకి వస్తుంది. ఇలాంటి పేదప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఎలక్షన్ల సమయంలో భయపడవలసిన అవసరం ఉండదు. నీతిగా న్యాయంగా పాలన చేసేవారి దగ్గరికి ఓటమి అనేది చేరుకోదని గుర్తుంచుకుంటే దేశంలో సగం అవినీతి తగ్గిపోతుందంటున్నారు ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: