ఈ మధ్య కాలంలో సౌకర్యవంతమైన జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్ వలన చిన్న వయస్సులోనే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడం అంత తేలిక కాదు. పొట్టలో కొవ్వు అధికంగా పేరుకుపోవటం వలన అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, డిప్రెషన్, అలసట, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, అజీర్ణం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
కానీ కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. రోజూ 20నిమిషాల పాటు బ్రేక్ ఫాస్ట్ తినడానికి ముందు నడవటం వలన జీవక్రియ మెరుగై కొవ్వు త్వరగా కరుగుతుంది. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ తినకపోతే పొట్ట తగ్గుతుందని భావిస్తారు. కానీ బ్రేక్ ఫాస్ట్ తినకపోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్రేక్ ఫాస్ట్ చేయనివారిలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. 
 
పీచుపదార్థాలను అధికంగా తీసుకోవటం వలన కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించవచ్చు. పొట్ట తగ్గాలంటే చల్లని నీటి కంటే వేడి నీటిని తాగటం మంచిది. వేడి నీరు జీవక్రియను వేగవంతం చేయటంతో పాటు క్యాలరీలను కూడా తగ్గిస్తుంది. బీర్ ఎక్కువగా తాగితే పొట్టలోని అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని గుర్తించుకోవాలి. పుచ్చకాయ, ఎర్ర జామ, పనస పండ్లు ఎక్కువగా తినేవారిలో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. 
 
గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే తినటం వలన కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు. పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటే పొట్టలోని కొవ్వు తగ్గుతుంది. వ్యాయామాలు చేయటం ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గి శరీర సౌష్టవం మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాయామాలైన జాగింగ్, రన్నింగ్, క్లంచెస్, ప్లాంక్స్ క్రమం తప్పకుండా చేయటం వలన పొట్టభాగంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: