ప్రస్తుత ప్రపంచపు వాణిజ్య పంటల్లో కివీ ఫ్రూట్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ కివీ పండ్లు ఎక్కువగా అడవులు, పర్వతాలు, కొండప్రాంతాల్లో పండుతాయి. కొద్దిగా ఎండ ఉన్నా ఇబ్బందేమీ లేదు. వీటిలో బరువు, పరిమాణం, ఆకారం, మెత్తదనాన్ని బట్టీ రకరకాలున్నాయి. ఈ పండ్లు ఏడాదంతా అందుబాటులో ఉంటాయి. నిజానికి 12వ శతాబ్దంలో సాంగ్ సామ్రాజ్య కాలంలో ఈ పండును వాడేవారు. ఆ తర్వాత ఇందులో ఉన్న పోషకాల వల్ల దీన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది.


మొదట్లో చైనీయులు దీన్ని మందుల తయారీలో మాత్రమే వాడేవారు. అక్కడ ఈ పండును చైనా గూస్‌బెర్రీ, యాంగ్ తావ్ అని పిలుస్తారు. ఐతే... 20వ శతాబ్దంలో ఈ పండు తొలిసారిగా న్యూజిలాండ్ వెళ్లింది. అంతే... ఆ తర్వాత ఇది ఆ దేశపు పండుగా మారిపోయింది. దీని పేరు కూడా న్యూజిలాండ్‌ జాతీయ పక్షి అయిన కివీ పక్షి పేరు పెట్టారు.


ఇప్పటికీ చైనాలో కివీ పండును పెద్దగా తినరు. పిల్లల మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే గర్భిణీ మహిళలకు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ పండు నుంచీ తీసే యాక్టినిడిన్‌ను... మాంసం వండేందుకు ఉపయోగిస్తున్నారు. కివీ పండును జ్యూస్, జామ్, క్యాండీస్‌లో కూడా వాడుతున్నారు. చిత్రమేంటంటే ఈ పండు అంత పులుపుగా ఏమీ ఉండదు. కానీ... నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. 100 గ్రాముల కివీలో 93 మిల్లీ గ్రాముల సీ విటమిన్ ఉంటుంది. అదే 100 నిమ్మకాయలో 54 మిల్లీగ్రాముల సీ విటమిన్ మాత్రమే ఉంటుంది.


కివీ పండ్లలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. విటమిన్ C తోపాటూ ఇందులో విటమిన్ K, E కూడా ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్... కివీ పండులో బాగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ బాగా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆస్తమా తగ్గేందుకు కూడా కివీ పండును ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: