చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చిన్న‌పిల్ల‌ల‌ను చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పిల్ల‌ల‌కు గుండెల్లో నిమ్ము చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే చ‌లికాలంలో శ‌రీరం అంతా చ‌లికి ప‌గ‌ల‌డం లాంటివి కూడా ఎక్కువ‌గా ఉంటాయి. అప్పుడు నువ్వుల నూనెతో పిల్ల‌ల‌కు చ‌క్క‌గా శ‌రీర‌మంతా మ‌ర్ద‌నా చేసి శ‌న‌గ‌పిండితో రుద్ది స్నానం చేయిస్తే చ‌లికాలంలో కూడా చ‌ర్మాన్ని కాపాడుకోవ‌చ్చు. చలికాలం తీవ్రమైన చలితో పాటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాల్ని కూడా వెంట మోసుకొస్తుంది. పిల్లల విషయంలోనైతే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. స్వెటర్లు, క్యాప్‌లు సరిగ్గా ధరించకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. కాబట్టి ఇంట్లోఉన్నా, బయటికి వెళ్లినా పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మాత్రం మరిచిపో కూడదు.

 

అసలే తీవ్రమైన చలి అంటే...కొందరు వాళ్ళ పిల్లలకు అడిగిన వెంటనే ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి కొనిచ్చేస్తుంటారు. వీటివల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం చలికాలం అయిపోయేంత వరకైనా పిల్లల్ని వీటి జోలికి పోకుండా చూసుకోవాలి. స్కూలుకు వెళ్ళే పిల్లలకు యూనిఫాంతో పాటు స్వెట్టర్‌, తలను కప్పి ఉండేలా క్యాప్‌లాంటివి కూడా వేసి పంపించాలి. అలాగే పాదరక్షల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చలికి పాదాలు పగలకుండా సాక్సులు, బూట్లు లాంటివి వేయాలి. పిల్లలకు సూప్స్‌, స్నాక్స్‌, భోజనం...ఇలా అన్నీ ఇంట్లోనే వేడి వేడిగా వండిపెట్టాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారం తినకుండా అదుపు చేయాలి.

 


ఫ్లూ రాకుండా ఉండేందుకు బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే క్యారెట్లు, లైకోపిన్‌ ఉండే టమోటో, క్యాప్సికం లాంటి వాటితో కూరలు లేదా సూప్స్‌ చేసి పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు పిల్లలకు అంది ఆరోగ్యంగా ఉంటారు.ఈ సీజన్‌లో వేధించే మరో సమస్య చర్మం పొడిబారడం. చల్లగా వీచే గాలుల వల్ల శరీరంలోని తేమ శాతం తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందులోనూ సుకుమారంగా ఉండే పిల్లల చర్మం మీద చలి ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: