గర్భసంచిలో గడ్డలు అనగానే చాలా మంది క్యాన్సర్‌ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ సంచిలో తలెత్తే గడ్డల్లో ఫై బ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు. గర్భ సంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాధృచ్ఛికంగా బయట పడుతుంటాయి.

 


గర్భ‌సంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను వీటిని ప్రభావితం చేస్తుందన్నది మాత్రం  వైద్యులు తెలుపుతున్నారు. ఇవి కొందరిలో వేగంగా మరికొందరిలో నెమ్మదిగా పెరగొచ్చు. కొన్ని ఎప్పుడూ ఒకే సైజులో ఉండొచ్చు, కొన్ని వాటంతటవే కుంచించుకుపోవచ్చు. నెలసరి నిలిచిపోయిన తర్వాత సహజంగానే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు కూడా చిన్నగా అవుతాయి. కొన్నైతే రాళ్లలా గట్టిపడిపోతాయి కూడా.

 


సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువ రోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: