త‌ల్లి చావు బ‌తుకుల మ‌ధ్య ఉంది... వెంటిలేట‌ర్‌పై ప్రాణాల‌తో పోరాడుతూ ఒక్క‌గానొక్క కొడుకును క‌నులారా చూడాల‌ని ఆ క‌న్న‌త‌ల్లి హృద‌యం వేడుకుంటోంది. ఖండ‌త‌రాల్లో ఉన్న‌ కొడుకు రాక కోసం ఎదురు చూస్తోంది. త‌ల్లికి ఆరోగ్యం బాగోలేద‌ని తెలిసిన నాటి నుంచి అక్క‌డ ఆ కొడుకు ఏడ్వ‌ని రోజూ నిముషం లేదు... త‌ల్లి త‌ప్ప క‌నుల ముందు వేరే ఏ దృశ్యం  ఆ కొడుకు క‌న‌బ‌డ‌టం లేదు. త‌న‌ను ఇండియా వెళ్ల‌నివ్వాల‌ని అమెరికా అధికారుల‌ను వేడుకుంటున్న వారు క‌రుణించ‌డం లేదు. ఇదీ హైద‌ర‌బాద్ న‌గ‌రంలోని   శ్రీనగర్‌ కాలనీలోని సాయిరాం మనోర్‌ టొపాజ్‌ బ్లాక్‌లో నివసిస్తున్న సులోచన-ఆమె కుమారుడు ప్ర‌శాంత్‌ల గాధ‌.  సులోచన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరింది. 

 

ఆమె ప‌రిస్థితి చాలా విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. అమెరికాలోని  కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌గా ప‌నిచేస్తున్న ఒక్క‌గానొక్క కొడుకు ప్ర‌శాంత్‌కు విష‌యం తెలిపారు. విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణం నుంచి త‌ల్లి వ‌ద్ద‌కు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న అనుమ‌తుల్లేక ఆగిపోయాడు. ఆధారాలు చూపిస్తేనే పంపిస్తామంటూ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. యశోద ఆస్పత్రి వైద్యులచే సులోచ‌న అనారోగ్య పరిస్థితిపై ఓ లేఖను ఇవ్వడంతో తండ్రి కుప్పురాం దాన్ని కొడుకుకు పోస్ట్‌ చేశాడు. ఈ లేఖను అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో అందజేసిన అనంతరం ఇండియాకు వెళ్లేందుకు వీసా మంజూరైంది. 

 

అది కూడా నేరుగా హైదరాబాద్‌కు రావడానికి వీల్లేకుండా పోవడంతో ఆయన బుధవారం అక్కడి నుంచి బయల్దేరి సింగపూర్‌లో దిగి గురువారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యంలో ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌టంతో ప్ర‌వాసీయులు రాక‌పోక‌ల‌కు అగ‌చాట్లు ప‌డాల్సి వ‌స్తోంది. ప్ర‌వాసీయులు ప‌డుతున్న బాధ‌ల‌కు ప్ర‌శాంత్ ఘ‌ట‌న అద్దంప‌డుతోందనే చెప్పాలి. ఇదిలా ఉండగా అమెరికాకు వెళ్ళాలనుకొని టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు అక్కడి నుంచి సెలవులకు ఇక్కడికి రావాలనుకునేవారు కూడా తమ టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకోవాల్సి రావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: