క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి గ‌ట్టి వార్నింగ్ వ‌చ్చిందంట‌. మూడు రోజుల క్రితం  అమెరికా నుంచి ఇండియా వ‌చ్చిన ఆయ‌న ఎమ్మెల్యే దంప‌తులు క్వారంటైన్‌కు వెళ్ల‌కుండా నేరుగా జ‌నంలోకి వెళ్తుండ‌టంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులే కొంత‌మంది నేరుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్కు తెల‌ప‌డంతో ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు క‌రోనా రాలేదని, థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ చేశార‌ని త‌న‌కు తానుగా మెడిక‌ట్ స‌ర్టిఫికెట్ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినా...ముందు క్వారంటైన్‌కు వెళ్లాల‌ని, బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి, ప్ర‌భుత్వం ఆదేశించిన నిర్ణ‌యాల‌ను పాటించ‌కుంటే ఎలా అంటూ కేసీఆర్ కాస్తంత ఘాటుగానే ఎమ్మెల్యేను మంద‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. 

 

దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే దంప‌తులు క్వారంటైన్‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. వాస్త‌వానికి ఈ నెల 16న కోనప్ప దంపతులు అమెరికా నుంచి వచ్చారు. అయితే క్వారంటైన్‌లో ఉండకుండా మరుసటి రోజే మున్సిపల్‌ సమావేశంలో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కోనప్ప దంపతులకు అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదనేది కోనప్ప వాదనగా తెలుస్తోంది.  వాస్త‌వానికి కరోనా వ్యాప్తి కారణంగా ఎవరైనా ఎంతటి గొప్పోరైనా 14 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లోగానీ సొంతంగా ఇంట్లో ఒంటరిగా పరి శుభ్రంగాగానీ తమను తాము క్వారంటైన్ చేసుకోవాలని ఆదేశించిన విష‌యం తెలిసిందే. 

 

అయితే అయితే ఎమ్మెల్యే కోనప్ప అవేవీ పాటించకుండా జ‌నంలో తిర‌గ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  వివాదాస్ప‌ద ప్ర‌జాప్ర‌తినిధిగా పేరుగాంచిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప క‌రోనా వివాదంలో ట్రోల్ అవుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌గా అమెరికా వెళ్లి వ‌చ్చి క్వారంటైన్‌లో ఉండాల్సిన ప్ర‌జాప్ర‌తినిధి ద‌ర్జాగా జ‌నంలో తిరుగుతుండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేకు క‌రోనా రూల్స్ వ‌ర్తించ‌వా అంటూ జ‌నం సోష‌ల్ మీడియాలో తిట్టిపోయ‌డంతో ప్ర‌భుత్వం స్పందించింది. వెంట‌నే క్వారంటైన్‌కు వెళ్లాల‌ని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: