తెలంగాణ‌లోనే అత్య‌ధికంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదువుతున్నాయి.  ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది మతప్రచారకులకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్క‌సారిగా కరీంనగర్ వాసులు ఉలిక్కిప‌డ్డారు. ఇప్పుడు వీరు ఇత‌ర ప్రాంతాల్లో కూడా ప‌ర్య‌టించ‌డంతో ఉత్త‌ర తెలంగాణ ప్రాంత‌వాసులంతా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఇదిలా ఉండగా ప్ర‌భుత్వం మెడిక‌ల్ స‌ర్వ‌కు ఆదేశించ‌డంతో ఏ వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని ప్ర‌జ‌లంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌తో ఉన్నారు. ఇండోనేషియన్లు తిరిగిన ప్రాంతాల్లో వ్యాధి సోకిన వారి గురించి చేస్తున్న సర్వే ఇప్పుడు ఏ మేరకు ఫలితానిస్తుందన్నది స్పష్టత రావట్లేదు. 

 

100 మెడికల్ టీంలు, 16టీంలకు ఒక డాక్టర్‌ చొప్పున ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి అన్నివర్గాల నుండి సహకారం అందడం కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంగుల ఇంటింటికి తిరిగి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్‌రోజునే 25వేల మందిని మెడికల్ టీంలు కలిసి వివరాలు సేకరించాయని, 28 మందిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించామని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిందని చెబితే ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తారన్న భయం కొందరిదైతే, చుట్టుపక్కలవారు తమ కుటుంబాన్ని వెలివేసే అవకాశం లేకపోలేదన్న భయం మరికొందరిని పట్టుకున్న‌ట్లుగా కూడా తెలుస్తోంది. 

 

కరోనా కోరల్లో చిక్కుకున్న కరీంనగర్‌ ప్రాంతంలో నిర్వహిస్తున్న మెడికల్ సర్వే ఎలాంటి ఫలితాన్నిస్తోందోన‌ని అటు ప్ర‌భుత్వం ఇటు ప్ర‌జానీకంలో తీవ్ర ఆందోళ‌నైతే నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక క‌రీంన‌గ‌ర్‌లో శ‌నివార ముఖ్య‌మంత్రి కేసీఆర్ పర్య‌టించ‌నున్నారు. దీనిపైనా కూడా జిల్లావాసుల్లో భ‌యం ఆవ‌హించింది. ప‌రిస్థితి తీవ్ర‌స్థాయికి చేరినందువ‌ల్లే ముఖ్యమంత్రి జిల్లా ప‌ర్య‌ట‌న చేయాల్సి వ‌స్తోంద‌న్న వాద‌న‌ను కొంత‌మంది వ్య‌క్తం చేస్తున్నారు. అయిత వైద్య వ‌ర్గాలు మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని, ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం సూచించిన ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటిస్తూ స‌హ‌క‌రించాల‌ని విన్న‌విస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: