క‌రోనా దేశ వ్యాప్తంగా విజృంభిస్తుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి కంట్రోల్‌లోనే ఉంద‌ని చెప్పాలి. క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేసింది. అందులో ఉన్న వివ‌రాల ప్ర‌కారం... రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. వారిలో 108 మందికి కరోనా నెగిటివ్‌ అని తేలింది. మిగిలిన 24 మంది రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు పేర్కొంది. అయితే  రాష్ట్రంలో ఇప్పటివరకు 1,006 మంది కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

 

 28 రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న  259 మందిని విడ‌త‌ల వారీగా ఇళ్లకు పంపారు. ఇక  711 మంది మాత్రం ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది.  ప్రస్తుతం 36 మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నార‌ని తెలిపింది. అయితే ఇప్పుడంతా మిగిలిన 24 రిపోర్టుల్లో ఏం వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న జ‌నంలో నెల‌కొంది. మిగతా రాష్ట్రాల‌తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సేఫ్ ప్లేస్‌లో ఉంద‌న్న అభిప్రాయం నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్‌లో సెటిలైన చాలామంది ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్వ‌స్థ‌లాల‌కు బాట ప‌ట్ట‌డం అక్క‌డి వారిని ఆందోళ‌నకు గురి చేస్తోందంట‌. 

 

హైద‌రాబాద్‌లో స్టేజి-2కు సంబంధించిన ఓ కేసు న‌మోదు కావ‌డ‌మే వారి ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌-19 పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ఇక  ఒంగోలులో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని స్ప‌ష్టం చేశారు. బాధితుడి కుటుంబం సభ్యుల నమూనాలను కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: