దేశంలో గంట‌గంట‌కు పెరుగుతున్న క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నా..దాని విస్త‌ర‌ణ‌ మాత్రం వేగంగా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా రాత్రి స‌మయానికి ఒక్క‌సారిగి 8 కేసులు పెరిగి 27కు చేరుకుంది. నిన్న ఆదివారం ఒక్కరోజే కొత్తగా  ఎనిమిది కేసులు న‌మోదుకావ‌డంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా, ఒకే కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకిన‌ట్లు ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ కావ‌డంతో వైర‌స్ వ్యాప్తిలో 2 ద‌శ ప్రారంభ‌మైన‌ట్లుగా మ‌రోసారి నిరూపిత‌మైంది. 

 

నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యాపారి వైరస్ బారిన పడగా, ఆతన కుమారుడికి, భార్యకు కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరితో పాటు గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ రాగా, అతనికి పాజిటివ్ వచ్చింది. లండన్ నుంచే దోహా మీదుగా వచ్చిన కూకట్ పల్లి ప్రాంత యువకుడికి కూడా వైరస్ సోకింది.వీరంద‌రినీ ప్ర‌స్తుతం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్ర‌త్యేక వార్డులో చికిత్స అంద‌జేస్తున్నారు. హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోవడంతో, కింగ్ కోటి ఆసుపత్రికి రోగులను తరలిస్తున్నారు. 

 

ఇదిలా ఉండ‌గా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో వైద్య సేవ‌లందించ‌డానికి కొత్త‌గా భ‌వ‌నాల ఏర్పాటు, ప‌రిక‌రాల‌ను స‌మాకూర్చే ప‌నిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ నిమ‌గ్న‌మైంది. అలాగే సమీప భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ ని ఇప్పటికే ఐసోలేషన్ కోసం సిద్ధం చేశారు.  రోగుల సంఖ్య‌ను బ‌ట్టి గ‌చ్చి బౌలి ప్ర‌త్యేక కేంద్రాన్ని వినియోగించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ పిలుపున‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా
మంచి స్పంద‌న వ‌స్తోంది. వ్యాపార సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: