రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు మ‌రికొన్నింటిని జ‌త చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం తాజా ఉత్త‌ర్వులను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్ర‌కారం మెడిక‌ల్ ఎమ‌ర్జీన్సీల‌కు మాత్ర‌మే బ‌య‌ట‌కి రావాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. అది కూడా ద్విచ‌క్ర‌వాహ‌నంపై  ప్ర‌యాణించేందుకు అనుమ‌తినిచ్చింది. కారులో అయితే ఇద్ద‌రు మాత్ర‌మే  ప్ర‌యాణించేలా నిబంధ‌న‌ను విధించింది. సాయంత్రం ఆరుగంట‌ల త‌ర్వాత ఎలాంటి దుకాణాలను  తెరిచి ఉంచ‌వ‌ద్ద‌ని పేర్కొంది. మెడిక‌ల్ షాపుల‌కు మాత్రం ఇందుకు మిన‌హాయింపును ఇచ్చింది. ఇక ప్ర‌జ‌లెవ‌ర‌రూ రోజూ సాయంత్రం 7గంట‌ల త‌ర్వాత ఉద‌యం 6గంట‌ల్లోపు రోడ్ల‌పైకి ఎట్టి ప‌రిస్థితుల్లో రావ‌ద్ద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

 

అలా వ‌చ్చిన వారిపై  కేసులు న‌మోదు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, పెద్ద మొత్తంలో జ‌రిమానాలు విధిస్తామ‌ని అవ‌స‌ర‌మైతే జైళ్ల‌కు కూడా పంపిస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. నిత్య‌వ‌స‌రాల స‌రుకుల‌ను తీసుకొచ్చుకునేందుకు రెండు మూడు కిలోమీట‌ర్లకు మించి ప్ర‌యాణించ‌కూడ‌ద‌ని కూడా నిబంధ‌న విధించింది. ఈ ప‌రిమితుల వ‌ల్ల ప్ర‌జానీకం చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతార‌న్న‌విష‌యం ప్ర‌భుత్వానికి తెలుస‌న‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగానే ఈ క‌ఠిన చ‌ర్య‌లను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని పేర్కొంది. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఉత్త‌ర్వుల్లో కోరింది. 

 

పైన పేర్కొన్న నిబంధ‌న‌ల‌న్నీ కూడా  1897లోని మెడిక‌ల్ ఎమ‌ర్జీన్సీ ఎపిడ‌మిక్ చ‌ట్టాన్ని అనుస‌రించి అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇతర రాష్ట్రాల వద్ద సరిహద్దులను మూసివేశామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయిలో కరోనా ప్రభావం అంత తీవ్రంగా లేదని, అయినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోక తప్పదని సీఎస్ తెలిపారు. ఎన్ఆర్‌డీఎస్ తమ విధులు కొనసాగిస్తారని సోమేశ్ కుమార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: