దేశంలోనే అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదవుతున్న మ‌హారాష్ట్ర ఆల‌స్యంగానైనా క‌ఠిన చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.
ముంబైలో అత్య‌ధిక మంది ప్ర‌యాణికులు వినియోగించే లోక‌ల్ ట్రైన్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ముంబై రైల్వే స్టేషన్‌కు వచ్చే స్థానిక, అవుట్‌ స్టేషన్‌ రైళ్లను మార్చి 31 వరకూ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ముంబై లైఫ్‌లైన్‌ పరిగణలోకి వచ్చే 3000 లోకల్‌ సబర్బన్‌ రైళ్లలో రోజు కనీసం 80 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారులు పేర్కొన్నారు.ఇక కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముంబై రైల్యే బోర్డు అధికారులు ఆదివారం మధ్యాహ్నం సమావేశమై అన్ని సబర్బన్ రైళ్ల సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. 

 

 ఇదిలా ఉండ‌గా ప్ర‌ధానిమోదీ ఇచ్చిన జ‌న‌తా క‌ర్ఫ్యూను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌య‌వంతమ‌య్యేలా చూసింది. అయితే సోమ‌వారం స్ప‌ష్ట‌మైన నిషేధాజ్ఞ‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు య‌థేచ్చ‌గా రోడ్ల‌పై తిరిగారు. దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. దీనికితోడు రెండు రోజుల కాలంలో మూడు క‌రోనా మ‌ర‌ణాలు ఇదే రాష్ట్రంలో చోటుచేసుకోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరిగింది. అదే స‌మ‌యంలో పాజిటివ్ కేసుల సంఖ్య వంద‌కు చేరువ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా ప్ర‌బ‌లితే ముంబై న‌గ‌రం క‌థ ముగిసిన క‌థే అంటూ ఇప్ప‌టికే నెటిజన్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్క‌డి స్ల‌మ్ ఏరియాల్లో ప్ర‌బ‌లితే వేలాది మందికి వేగంగా వ్యాధి వ్యాప్తి చెందే ప్ర‌మాద‌ముంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

క‌రోనా కార‌ణంగా సబర్బన్‌ రైళ్ల సేవలను రద్దు చేయడం దాదాపు ఇదే మొదటిసారని తెలుస్తోంది. 1974లో  ట్రేడ్‌ యూనియన్‌ సమ్మె కారణంగా సబర్బన్‌ రైళ్లతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను 20 రోజుల పాటు నిలిపివేసినట్లు  రైల్యే ప్రతినిధి పేర్కొన్నారు. ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూలో భాగంగా ప‌రిమితితో కూడిన సబర్బన్‌ రైళ్లు నడిపించారు. ఇదిలా ఉండ‌గా ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ సమాచారం ప్రకారం..  గడిచిన 24 గంటల్లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదు కావడంతో ముంబై న‌గ‌రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 38కి చేరాయి. రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ముంబై 
స‌మాచారాన్ని తెలుసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: