తెలంగాణ‌లో నాలుగు రోజుల క్రితం తొలి ప్రైమ‌రీ కాంటాక్టు క‌రోనా కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ‌లో నివాస‌ముంటున్న ఓ మ‌హిళ‌కు క‌రోణా పాజిటివ్ రావ‌డంతో వైద్యాధికారులు అల‌ర్ట్ అవుతున్నారు. ఆమె నివాసం ఉంటున్న  అపార్ట్‌మెంటు వాసుల‌తో పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా  ప్ర‌ధానిమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లుగానే వైర‌స్ వ్యాప్తిలో వేగం పెరిగింద‌న‌డానికి ఈ కేసే నిద‌ర్శ‌న‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. నాలుగు రోజుల క్రితం కూక‌ట్‌ప‌ల్లికి చెందిన ఓ మ‌హిళ‌కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో మ‌హిళ‌కు కూడా పాజిటివ్ రావ‌డం విశేషం.

 

 ఇద్ద‌రు కూడా హైద‌రాబాదీ వాసులే. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 37 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 35కేసులు విదేశాల నుంచి వ‌చ్చిన వారే ఉన్నారు. ఈ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు మాత్రం ప్రైమ‌రీ కాంటాక్టు విధానంలో అంటే వైర‌స్ సోకిన వ్య‌క్తి తాకిన వ‌స్తువుల‌ను తాక‌డం ద్వారానో..అత‌డితో క‌రాచాల‌నం, అత‌డు వాడిన వ‌స్తువుల‌ను వాడ‌డం లేదా అత‌డు ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు మీట‌రు కన్నా త‌క్కువ దూరంలో ఉండ‌టంతో క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌టానికి వారం లేదా ప‌దిరోజుల స‌మ‌యం వ‌ర‌కు ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

 

 వైర‌స్ సోకిన స‌మ‌యంలో వారికి కూడా వెంట‌నే తెలియ‌డం జ‌ర‌గ‌ద‌ని, ఈ కార‌ణం చేత కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల మ‌ధ్య తిరగ‌డం ద్వారా వారికి కూడా ఈ వ్యాధి ప్ర‌బలుతుంద‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు కూడా ఈ ప‌ద్ధ‌తిలోనే ఇప్పుడు వైర‌స్ సోకింది. ఈ లెక్క‌న హైద‌రాబాద్‌లో చాలా మందికే వైర‌స్ సోకి ఉంటుంద‌న్న‌ది వైద్యాధికారులు చెబుతున్న అంశం. ముఖ్య‌మంత్రి కేసీఆర్ 19వేల‌మందిపై నిఘా కొన‌సాగుతోంద‌ని వ్యాఖ్య‌నించ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఇదే అని కొంత‌మంది నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌టంతో జ‌నాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: