గుంటూరు జీజీహెచ్‌లో వృద్ధుడు మ‌ర‌ణించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కొద్దిరోజులుగా స‌ద‌రు వృద్ధుడు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ప్ర‌త్యేక వార్డులో చికిత్సపొందుతున్నాడు. ఈ క్ర‌మంలోనే  మంగళవారం గుండెపోటుతో ఆస్ప‌త్రిలోనే మ‌ర‌ణించాడు. ఈవిష‌యం తెలుసుకున్న గుంటూరు జిల్లావాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. వృద్ధుడు స్థానికుడే కావ‌డంతో ప్రైమ‌రీ కాంటాక్టుతోనే ఆయ‌న‌కు సోకి ఉంటుంద‌ని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. అదే జ‌రిగితే ఇంకా చాలామందికి సోకే ఉంటుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వృద్ధుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు, ఆయ‌న‌తో ఇటీవ‌ల సంభాషించిన‌వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు. 

 

ఇదిలా ఉండ‌గా ఆస్ప‌త్రి సూప‌రిటెండెంట్  మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వృద్ధుడి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి టెస్టుల కోసం ల్యాబ్‌‌కు పంపామని.. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అయితే  మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు అతడు విదేశీ ప్రయాణం చేయలేదని, అలాగే విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో కలవలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రిపోర్టులు రాగానే క్లారిటీ వస్తుందని తెలిపారు.  ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.. అనుమానం మాత్రమేనని చెబుతున్నారు. నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు తేలాకే మృత‌దేహాన్ని త‌ర‌లించాల‌ని కొంత‌మంది కోరుతున్నారు. 

 

హైద‌రాబాద్‌లో స్టేజి-2కు సంబంధించిన రెండు కేసులు న‌మోదు కావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో ఆందోళ‌న పెరిగింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌-19 పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు లాక్‌డౌన్ పాటించాలని కోరారు. ఇక  ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన కరోనా పాజిటివ్ బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని స్ప‌ష్టం చేశారు. బాధితుల కుటుంబం సభ్యుల నమూనాలను కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: