తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ఉధృత‌మ‌వుతోంది.మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి కొత్త కేసులేమీ న‌మోదు కాలేద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం సంబుర‌ప‌డేలోపే క‌రీంన‌గ‌ర్లో ప్రైమ‌రీ కాంటాక్టుకు సంబంధించిన కొత్త కేసు నిర్ధార‌ణ అయింది. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోకల్‌ కాంటాక్టు ద్వారా వైర‌స్ సోకిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇప్ప‌టికే కొత్తగూడెం డీఎస్పీ, వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా ఈ ప‌ద్ధ‌తిలోనే వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే.  మంగళవారం తొలుత డీఎస్పీతోపాటు ఆయన ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదని ప్రచారం జరగగా.. చివరికి ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 

 ఇక ఇప్పటికే పాటిజివ్‌గా తేలిన మణికొండకు చెందిన వ్యక్తి కుటుంబంలోని మహిళ(64)కు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో ఇంతకుముందే ఇద్దరికి లోకల్‌ కాంటాక్టు ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 39కి చేరింది. మరో రెండు పాజిటివ్‌ కేసులు కూడా నిర్ధారణ అయినా.. వారి నమూనాలను మరోసారి పరీక్షించిన అనంతరం వెల్లడిస్తామ‌ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే మంగళవారం నమోదైన నాలుగు కేసుల్లో ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు 60 ఏళ్ల వయసు పైబడినవారూ  ఉన్నారు.

 

 ఇందులో  లండన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి(34)తోపాటు జర్మనీ నుంచి వచ్చిన కోకాపేటకు చెందిన మహిళ(39)కు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన మరో మహిళ(36)కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇదిలా ఉండ‌గా జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరిని గాంధీ ఆస్పత్రికి తరలించడంతోపాటు ఐదుగురిని జిల్లా కేంద్రంలోని ఐసొలేషన్‌ కేంద్రంలో చేర్చారు. అలాగే  నారాయణపేట జిల్లా కొత్తగార్లపల్లి గ్రామానికి చెందిన 9 మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి రాగా.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: