భార‌త్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా వైర‌స్ రూపాంత‌రం చెందిన‌ట్లుగా  జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకులు గుర్తించారు.కరోనా వైరస్‌ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లుగా ప‌రిశోధ‌కుల క‌నుగొన‌డం గ‌మ‌నార్హం. అయితే  చైనా, యూరప్ దేశాల్లో  వ్యాప్తి చెందుతున్న  కరోనా వైరస్‌ రకమే రూపాంతరం చెంది భారత్‌లోనూ విస్తృతంగా వ్యాపించి నట్లు జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. జెడ్‌ఎస్‌ఐలోని ఏడుగురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపినట్లు  కోల్‌కతా విభాగం డైరెక్టర్‌ కైలాష్ చంద్ర పేర్కొన్నారు. 


ప‌రిశోధ‌కులు భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు 400 జన్యురాశులపై అధ్య‌య‌నం చేయ‌గా వాటిలో 198 వేర్వేరు కరోనా వైరస్  రకాలను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. అధ్య‌య‌నాల‌ను బ‌ట్టి క‌రోనా వైరస్‌ భారత్‌లో ప్రవేశించే ముందు నాటికే 198 సార్లు రూపాంతరం చెంది ఉంటుంద‌ని జెడ్‌ఎస్‌ఐ కోల్‌కతా విభాగం డైరెక్టర్‌ కైలాష్ చంద్ర అభిప్రాయ‌ప‌డ్డారు. దిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా వెలువ‌డుతున్న నివేదిక‌ల ఆధారంగా శోధ‌న‌లు సాగిస్తున్న‌ట్లు కైలాష్ చంద్ర తెలిపారు. మార్చి మొదటి వారం, మే చివరి వారంలో వివిధ జన్యురాశులను విశ్లేషించినట్లు తెలిపారు. 


ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ కృత్రిమంగా మనిషి ల్యాబ్‌లో సృస్టించాడా.? లేదా మాములు వైరస్ లానే రూపాంతరం చెందినదా..? అనే విష‌యం ప‌ట్టిపీడిస్తోంది. ఇది జ‌వాబులేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. క‌రోనాపై జ‌రుగుతున్న అధ్య‌య‌నాల్లో చాలామంది శాస్త్ర‌వేత్త‌లు, బృందాలు మాత్రం వైర‌స్ మ‌నిషి సృష్టి కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్ Coronaviridae ఫ్యామిలీకి చెందింద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  గ‌తంలో మాన‌వ జాతిపై దాడి చేసిన సార్స్‌, మెర్స్‌లు కూడా  కరోనా వైరస్ జన్యువు RNAను కలిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇది మనుషుల్లో జలుబు, శ్వాశకోస సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: