తమిళనాడు రాష్ట్రంలో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. గ‌త నాలుగు రోజులుగా వరుసగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. గురువారం  ఏకంగా 1300కు పైగా కోవిడ్-19 కేసులు రాష్ట్రంలో నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. గురువారం కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర  ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. 585 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 


తాజా కేసులతో కలుపుకొని త‌మిళ‌నాడు రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 27,256కు చేరింది. వీరిలో 14,901 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 12,132 మంది వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండ‌గా గా, బుధ‌వారం 610 మంది క‌రోనా రోగులు వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. భారత్‌లోని మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతుండగా, తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. గురువారం కూడా ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి.


మ‌హారాష్ట్రలోని ముంబై మ‌హాన‌గ‌రంతో పాటు పుణెలాంటి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కరోనా కేసులు రోజూ వేలాదిగా న‌మోదవుతూనే ఉన్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే అక్క‌డ సామూహిక వ్యాప్తికి చేరింద‌ని ఆరోగ్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే త‌మిళ‌నాడులో చెన్సై మ‌హా న‌గ‌రంలో కూడా ఎక్కువ‌గా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. రోజురోజుకు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మ‌ర‌ణాల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది. త‌మిళ‌నాడులోని కోయంబేడు మార్కెట్ కేంద్రంగా కరోనా కేసుల విజృంభణ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: