తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఏది ఏమైనా స‌రే ఇక‌పై లాక్‌డౌన్ కొన‌సాగించ‌లేమ‌ని కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెగేసిన‌ట్లుగా స‌డ‌లింపులిస్తున్న క్ర‌మంలో... రోడ్ల‌పై జ‌న సంచారం ఎక్కవై రెండు తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వేగంతో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టం గ‌మనార్హం. ఏపీలో కొత్తగా 138 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో  న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికంగా గ్రేట‌ర్‌ప‌రిధిలోనే ఉంటుండ‌టం  తెలిసిందే. రాష్ట్ర‌ప్ర‌భుత్వం తెలుపుతున్న వివ‌రాల ప్ర‌కారం..83శాతానికి పైగా ఇక్క‌డే న‌మోద‌వుతున్నాయి. 


శుక్ర‌వారం గ్రేటర్ హైదరాబాద్‌లోనే 116 నమోదవ్వగా.. రంగారెడ్డి 8, ఆదిలాబాద్ 2, మహబూబ్‌నగర్ 5, మంచిర్యాల 1, కరీంనగర్‌లో 2, మేడ్చల్ 2, సంగారెడ్డి 2, ఖమ్మం 2, వరంగల్ 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌లో  ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 1627 మంది వ‌ర‌కు కోలుకుని ఇంటికి చేర‌గా మరో 1,550 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 138 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. తెలంగాణ‌లో  గ్రేట‌ర్ ప‌రిధిలో అనేక హాట్‌స్పాట్లు ఉన్నాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒకే ప్రాంతం నుంచి ఇలా ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


అంతేకాక ఏపీలో న‌మోద‌వుతున్న కేసుల్లో వ‌ల‌స కూలీల‌వే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటోంది. కొత్త‌గా కేసుల సంఖ్య కూడా తెలంగాణ క‌న్నా ఏపీలో త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నించాల్సిన విష‌యమ‌ని ఆరోగ్య‌నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ప‌రిస్థితి అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశాలున్నాయ‌ని, ప్ర‌జ‌ల్లో కూడా ఎంతో ప‌రిణితి క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్ర‌వారం వివిధ జిల్లాల‌కు చెందిన వారు 50మంది, వ‌ల‌స కూలీలు 84మందికి, ఎన్ఆర్ఐలు న‌లుగురికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ అయిన విష‌యం తెలిసిందే. కరోనాతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: