సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం లేవ‌గానే టీ లేదా కాఫీ తాగందే రోజు కూడా గ‌డ‌వ‌దంటారు. బెడ్ కాఫీతో రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు. ఇక ఏదైనా టెన్ష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఓ క‌ప్పు టీ లేదా కాఫీ తాగితే.. వ‌చ్చే రిలీఫ్ అంతా ఇంతా కాదు. వాస్త‌వానికి వేడి వేడి టీ లేదా కాఫీ గొంతు నుంచి దిగుతుంటే కలిగే హాయి మాటల్లో చెప్పలేం. అయితే టీ, కాఫీలు తాగ‌డం కొందరు మంచిదేనంటే, మరికొందరు అస్సలు తీసుకోవద్దంటున్నారు. మ‌రి టీ, కాఫీలు తాగ‌డం వ‌ల్ల మంచిదా.. కాదా.. అంటే.. వీటి వ‌ల్ల లాభాలు ఉన్నాయి, న‌ష్టాలు ఉన్నాయి. అవేంటో చూస్తే...

 

టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. కొవ్వు పదార్థాలైన ట్రైగ్లిజరైడ్స్ ను కొంతమేర తగ్గిస్తాయి. కొవ్వు పదార్థాలను కొంత మేర తగ్గిస్తుంది కాబట్టి, పక్షవాతాన్ని కూడా కొంతవరకు నిరోధించగలదు. రక్తనాళాల్లోని లోపలి పొర ఎండోథీలియంలో రక్తం సాఫీగా ప్రసరణ జరిగేందుకు టీ తోడ్పడుతుంది. అందుకే కొంతమేర బ్రెయిన్ స్ట్రోక్ ను తగ్గిస్తుందట. ఇక కాఫీ అంటే ఉత్తేజానికి మారుపేరు అని చెబుతారు. అలాగే కాఫీలో మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఔషధగుణాలున్న పదార్థం ఉంటుంది. మ‌రియు  టీ లేదా కాఫీ రోజుకి రెండు సార్లు త్రాగడం వల్ల మతిమరుపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 

 

ఇక అదే టీ, కాఫీ న‌ష్టాల విష‌యానికి వ‌స్తే.. ఆహారం, కూరగాయలు, పండ్ల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్ ను శరీరం శోషింపచేసుకోవడంలో టీ ప్రతిబంధకంగా మారుతుంది. ఇక హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాఫీ తాగిన కాసేపట్లోనే బీపీలో పెరుగుదల మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అది కనీసం గంట సేపైనా ఈ ప్రభావం ఉంటుందట. అలాగే ఉదయాన్నే వేరే ఏదీ తీసుకోకుండా టీ లేదా కాఫీ తాగడం వల్ల.. మీ పేగులపైనా ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ ఆకలి తగ్గిపోవడంతో పాటు జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిగా మారుతుంది. మ‌రియు దీని వ‌ల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. అందుకే టీ, కాఫీల విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌ల‌తో పాటు మితంగా తీసుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: