తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగానే మిడ‌త‌ల దండు వ‌చ్చేసింది. మిడతల దండు తెలంగాణాలోని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలో శుక్ర‌వారం పెద్ద సంఖ్య‌లో క‌నిపించింది. గోదావరి తీరంలోని చెట్లపై ఆకులు తింటుండాన్ని స్థానికులు గ‌మ‌నించి అధికారుల‌కు తెలిపారు. దీంతో విష‌యాన్ని రాష్ట్ర ఉన్న‌తా ధికారుల‌కు తెలిపి ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే గురువారం భూపలపల్లి జిల్లా కలెక్టర్ అజీం కూడా గోదావరి తీరంలో పర్యటించి అప్రమత్తం చేశారు. ఆ ప్రాంత సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


ఆ ప్రాంతంలో రసాయనాలను చల్లేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దంపేట  ప్రాంతంలో పంటలు అంతగా లేనందున అటవీ ప్రాంతంతో పాటు, నదీ తీరంలో మొలిచిన మొక్కల ఆకులను తింటున్నాయి. ఒక్కో మిడత..750 గుడ్లు ఒక్క గుంపు ఒక్క రాత్రిలోనే 30 వేల మంది తినే ఆహారాన్ని తినేస్తాయ‌ని అంచ‌నా. వాస్త‌వానికి మిడతలు మన రాష్ట్రంలోకి  వస్తే.. ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పంటలపై ప్రభావం పడే చాన్స్ ఉంద‌ని అధికారులు ముందే గుర్తించారు. వారు గుర్తించిన‌ట్లుగానే గోదావ‌రికి ఆనుకుని జిల్లాల్లోకి ముందుగా ప్రవేశిస్తున్నాయి. 

 

అయితే  పత్తి, మొక్కజొన్న, వరినాట్లు మొదలుకానందున పెద్ద‌గా పంట‌ల‌కు ప్ర‌మాదం లేద‌ని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మిడతలు పెట్టే గుడ్ల నుంచి పిల్లలు పుట్టి, జూన్, జులైలో పంటలపై దాడి చేసే ప్రమాదం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. ప్రధానంగా వరి, కంది,పెసర, జొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇదిలా ఉండ‌గా . చౌడు, తేలికపాటి, ఇసుక నేలల్లో మిడతలు గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ మిడత మూడు ఎగ్‌ పౌచ్‌లలో 750 గుడ్లు పెడుతుంది. మిడతలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాక, గుడ్ల నుంచి పిల్లలు వచ్చి పంటను నష్టపరుస్తాయి. రోజుకు 80–100 కి.మీ ప్రయాణిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌నుష్యుల‌కు వీటితో ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: