టీఆర్ ఎస్ నేత‌ల‌కు క‌రోనా చుట్టుకుంటోంది.ఇప్ప‌టికే జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి పాజిటివ్గా నిర్ధార‌ణ అయింది. ఇక ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతున్నారు.తాజాగా మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. 
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. ఇటీవలే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.  

 

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. యాదాద్రి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కరోనా వైరస్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు. 

 

అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ శుక్ర‌వారం కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 133 కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4484కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇదిలా ఉండ‌గా మ‌రో రెండు రోజుల్లో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్న వార్త‌ల‌తో జ‌నాలు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఆందోల‌న చెందుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: