అస‌లే గిరాకీ లేక అత‌లాకుత‌లం అవుతున్న ఆటో ఇండ‌స్ట్రీకి ఇప్పుడు ఉద్యోగుల రూపంలో ఫ్యాక్ట‌రీలోకి క‌రోనా ప్ర‌వేశిస్తోంది. దీంతో పదుల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సంస్థ‌లు క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో మ‌ళ్లీ ప్లాంట్ల‌ను మూసేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఉద్యోగుల వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌లో లోపాల కార‌ణంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. తాజాగా   దేశ రాజధాని నగరమైన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నగరంలో ఉన్న మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది.


 కర్మాగారంలో కరోనా సోకిన 17 మంది ఉద్యోగులు అదృశ్యం అవడంతో వైద్యాధికారులు, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కరోనా రోగులు గురుగ్రామ్, జజ్జార్ ప్రాంతాల్లో నివాసముంటున్నారని ప్రాథ‌మికంగా స‌మాచారం అందుకున్న‌ట్లు తెలుస్తోంది. పోలీసులు పరారీలో ఉన్న క‌రోనా రోగుల‌పై కేసులు న‌మోదు చేశారు. వారి కోసం తీవ్రంగా వెత‌క‌డం ప్రారంభించారు.  ఇదిలా ఉండ‌గా గురుగ్రామ్ జిల్లాలో ఇప్పటివరకు 67 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.  గురుగ్రామ్ నగరంలో ఒక్క సోమవారం రోజే 85 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో గురుగ్రామ్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 4,512కు పెరిగింది. 

 

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌లో కరోనా మహమ్మారి మరో 445 మందిని బలితీసుకుంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక్కరోజులో కొత్తగా 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 4,25,282కు, మరణాల సంఖ్య 13,699కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన తర్వాత జూన్‌ 1 నుంచి 22వ తేదీ వరకు ఏకంగా 2,34,747 పాజిటివ్‌ కేసులు బహిర్గతం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: