మన ఒంట్లో ప్రతి కణానికీ తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అవసరం. ఇవి రక్తం ద్వారానే అందుతాయి. లేకపోతే అవయవాలన్నీ చతికిల పడిపోతాయి. రక్తం సరిగా సరఫరా కాకపోతే కాళ్లు, చేతులు చల్లబడిపోతాయి. మొద్దుబారతాయి. చర్మమైతే పొడిబారిపోతుంది. గోళ్లు పెలుసుగా తయారవుతాయి. మగవారిలో స్తంభన లోపం తలెత్తొచ్చు. మధుమేహుల్లో పుండ్లు మానకుండా వేధిస్తుంటాయి. అందువల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండటం చాలా కీలకం. కొన్ని జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

 

పొగాకులోని నికొటిన్‌ రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. రక్తం చిక్కగా అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం సరిగా ముందుకు సాగదు. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల జోలికి వెళ్లొదు. ఒకవేళ వీటిని కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యటం ఉత్తమం. అధిక రక్తపోటుతో రక్తనాళాలు గట్టిపడతాయి. ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. కాబట్టి రక్తపోటు 120/80 కన్నా మించకుండా చూసుకోవాలి. ఇంతకన్నా తక్కువున్నా మంచిదే. వృద్ధాప్యం, ఇతరత్రా సమస్యలను బట్టి రక్తపోటు పరిమితి ఆధారపడి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదించి ఎవరికి, ఎంత వరకు ఉండొచ్చో నిర్ణయించుకోవాలి.రక్తంలో దాదాపు సగం వరకు నీరే ఉంటుంది. నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి సరఫరాకు ఇబ్బంది కలగొచ్ఛు అందువల్ల తగినంత నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాలి. వ్యాయామం చేసేవారికి, బయట తిరిగే పనులు చేసేవారికి మరింత ఎక్కువ నీరు అవసరం.

 

శారీరకశ్రమ, వ్యాయామంతో రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి వ్యాయామాల మూలంగా కండరాలకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ అందుతుంది. గుండె వేగంగా కొట్టుకోవటం వల్ల గుండె కండరం దృఢమవుతుంది. రక్తపోటూ తగ్గుతుంది. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం ఎంతైనా మంచిది. ఒక మాదిరి వేగంతో గంటకు మూడు మైళ్లు నడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: