తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ‌త ఐదు రోజులుగా 8వంద‌ల‌కు పైగానే కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ ప‌రిధిలోనే 94శాతం కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని వైద్య వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. అయితే గ‌డిచిన మూడు రోజులుగా జిల్లాల్లోనూ గ‌ణ‌నీయంగానే కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఒక్క జ‌న‌గామ‌లోనే మంగ‌ళ‌వారం 10కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇక వ‌రంగ‌ల్ జిల్లాలో ఐదుగురు జ‌ర్న‌లిస్టుల‌కు పాజిటివ్గా నిర్ధార‌ణ అయింది. కొత్త‌గూడెం జిల్లాలో 6గురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. 


ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో క్ర‌మంగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి,  జూన్ 21న తెలంగాణలో 730 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదయ్యాయి. జూన్ 22న రాష్ట్రంలో 872 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా టెస్టులు పెంచడంతో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో, రంగారెడ్డి జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 879 కోవిడ్ కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌లో 112 కేసులు నమోదయ్యాయి. 

 

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో లాక్ డౌన్ మ‌ల్లీ అమ‌ల్లోకి తేవాల‌న్న డిమాండ్ స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్‌లోనే 94శాతం కేసులు పెరుగుతున్న‌ట్లు గుర్తించిన వైద్య వ‌ర్గాలు ఇక్క‌డ లాక్డౌన్ అమ‌ల్లోకి తెస్తేనే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చాలా న‌గ‌రాల్లోని లాక్‌డౌన్‌ను అమ‌లు చేసేందుకు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడులోని చెన్నై ప‌ట్ట‌ణంలో కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగిస్తున్నారు. ఈనేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోనూ లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌నే డిమాండ్ స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: