దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా దాదాపుగా 10వేల పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం ఏకంగా దేశంలో 15వేల కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.  కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారందరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అన్న‌ది ప్ర‌భుత్వాల‌కు..ఆస్ప‌త్రి సిబ్బందికి త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేప‌థ్యంలోనే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట‌య్యాయి. ఆస్ప‌త్రులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి త‌గ్గించేందుకు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి. వాస్త‌వానికి కొద్ది రోజుల కింద‌టే క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుంటే ఆస్ప‌త్రికి రాకుండా ఇంటి వ‌ద్దే హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొంద‌వ‌చ్చ‌ని వైద్యులు తెలియ‌జేశారు. 

 

ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా దీనిపై ప్ర‌క‌ట‌న చేశాయి. తాజాగా స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించాయి. ఈక్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం సైతం సూచ‌న‌లు చేసింది. ఇకపై పాజిటివ్‌గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి దగ్గరే చికిత్స అందించేలా కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘క్లినికల్‌ గైడెన్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కరోనా’పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటిస్తూ కరోనా పేషంట్లకు చికిత్స అందించాలని సూచించింది.

 

 బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మీడియాతో  మాట్లాడుతూ కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. క‌రోనా  లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోమని ఈ సందర్భంగా ఈటల స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: