క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రికి ఇక‌పై ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది.  కరోనా పరీక్షల నిర్వహణకు ఇన్నాళ్లు అనుసరించిన స్ట్రాటజీని  మార్చింది.  దేశంలో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని తాజాగా  సూచించింది. కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ కావాల‌ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్ సూచించింది. ఐసీఎంఆర్‌ విడుదల చేసిన సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లకు సూచనలు చేస్తున్నాయి.

 

 కరోనా లక్షణాలుగా కనిపించిన వెంటనే ఇంట్లో తగినంత స్థలం ఉన్నవారు హోమ్‌ క్వారంటైన్‌ కావాలని ఐసీఎంఆర్‌ సూచించింది.కొద్దిపాటి జ్వరం, ఒళ్లు, నొప్పులులాంటి లక్షణాలున్నవారు నొప్పులను, జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్‌లాంటి మాత్రలు వాడి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  వాస్త‌వానికి ఐసీఎంఆర్  గైడ్‌లైన్స్ ప్ర‌కారం హాస్పిటళ్లు, కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లలలో కరోనా లక్షణాలున్న వ్యక్తికి, కరోనా పేషెంట్ కాంటాక్టు, అంతర్జాతీయ ప్రయాణం చేసినవారు, ఆరోగ్య సిబ్బందిలో ఈ వైరస్ లక్షణాలున్నవారికే టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని మే 18వరకు అనుసరించింది.

 

 ఎటువంటి లక్షణాలు లేకున్నా  ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ ఆదేశించడం ఇది తొలిసార‌ని ఓ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేర‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ఈ ఒక్క‌రోజ కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 225 కు చేరింది. కొత్తగా 137 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,361 కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: