ఇబ్బ‌డి ముబ్బ‌డిగా రోజూ వెయ్యికి ద‌గ్గ‌ర‌గా జీహెచ్ ఎంసీ ప‌రిధిలో క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అవుతుండ‌టంతో లాక్‌డౌన్ విధించేందుకు కూడా సిద్ధ‌మే అన్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంద‌డంతో అప్ప‌టి నుంచే లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకువ‌స్తే ఎలా ఉండ‌టుంద‌న్న దానిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చేట్లుగా లేక‌పోవ‌డంతో  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడానికే తెలంగాణ ప్రభుత్వం  మొగ్గు చూపుతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. 


రెండు రోజుల క్రితం త‌న‌ను క‌ల‌సిన ఉన్నతాధికారుల‌తో సైతం అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అనేది చాలా పెద్ద విషయమని.. దీనిపై ప్రభుత్వ యంత్రాగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడిన‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ చాలా పెద్ద నగరమని.. ఇక్కడ కోటి మంది నివసిస్తున్నారని మిగ‌తా నగరాల్లో మాదిరిగానే ఇక్క‌డా  కరోనా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నార‌ట‌.  కరోనా పెరగడంతో చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌కు సంబంధించి రెండు, మూడు రోజుల్లో కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్టు స‌మాచారం. కాగా, ఈ సారి లాక్‌డౌన్‌ విధిస్తే.. కఠిన అంక్షలు అమలు చేయనున్నట్టుగా సమచారం. 

 

ఇదిలా ఉండ‌గా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు 10 వేలు దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. శనివారం 888 కేసులు నమోదైన విష‌యం తెలిసిందే. శ‌నివారం ఒక్క‌రోజే జీహెచ్ ఎంసీ ప‌రిధిలో క‌రోనాతో  ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,436 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క  జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 10,150 పాజిటివ్‌ కేసులున్నాయి. ఇప్పటికే 243 మంది మృతి చెందారు. వీరిలో 206 మందికిపైగా నగరవాసులే. అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్‌ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చల్, నాలుగో స్థానంలో సూర్యాపేట, ఐదోస్థానంలో నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: