ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఒక్క‌రోజే  కొత్త‌గా ఖ‌మ్మంలో 11కేసులు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 7 కేసులు, తొలి క‌రోనా మ‌ర‌ణం చోటు చేసుకున్నాయి. గురువారం కొత్త‌గా  ఖ‌మ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఇద్ద‌రు వైద్యుల‌కు, ముగ్గురు హెడ్ నర్సులు,  ఒక‌ స్టాఫ్ నర్స్ ఆమె ఇద్ద‌రి పిల్ల‌ల‌కు, శ్రీనివాసనగర్ కు చెందిన మ‌రో ఇద్ద‌రు దంప‌తుల‌కు,  పెనుబల్లిలో ఒక‌రికి 1 క‌రోనా ప‌రీక్ష ఫ‌లితాల్లో పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఖ‌మ్మం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 98కి చేరుకుంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గురువారం కొత్త‌గా 7కేసులు న‌మోదు కాగా అన్ని కూడా పాల్వంచ మండ‌ల‌కేంద్రానికి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇందులో ఆరుగురికి గ‌తంలో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన ఒకే వ్య‌క్తి నుంచి వ్యాప్తి చెందిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు. ఇంకొక‌రికి  ఎలా సంక్ర‌మించింద‌నే విష‌యాన్ని ట్రావెల్ హిస్ట‌రీ ఆధారంగా గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఏడు కేసుల‌తో భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో మొత్తం కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ప్ర‌స్తుతం 28 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 126 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే జిల్లాకు చెందిన మరో ఏడుగురికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెలువరించిన నివేదికల్లో నిర్ధారించింది. ఖమ్మం ఆస్పత్రి నుంచి సేకరించిన నమూనాల్లో కొందరి నివేదికలు రాగా వారిలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా జిల్లాకు చెందిన 98 మంది కరోనా బారినపడగా 25 మంది కోలుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజులోనే రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9,226గా ఉన్నాయి. గత 24 గంటల్లో 987 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,069కు చేరింది. ఇక గురువారం మరో ఎనిమిది మంది కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 275కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: