రెమిడెసివిర్ ఔష‌ధం ధ‌ర దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రేట్ల‌కు అమ్మకాలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం నిర్ధిష్టండ‌గా ఎమ్మార్పీ నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ దుక‌ణాదారులు మాత్రం ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. మెడిక‌ల్ స్టోర్ల యజమానులకు, డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ మందు రేటును అనేక రెట్లు పెంచి, జనాన్ని దోచుకుంటున్నారు. దిల్లీ, ముంబై, గుజ‌రాత్‌, హైద‌రాబాద్, చెన్నైల‌లో  ఔషధ దుకాణాల నుంచి విచ్చలవిడిగా నల్లబజారుకు తరలిపోతోంది. రోజురోజుకూ దీని ధర పెరిగిపోతోంది. బాధితుల ప్రాణాలను తమ జేబులు నింపుకునే ముడిసరుకుగా ఉపయోగించుకుని ఔషధం ధరను వేలకు వేలు పెంచేసి విక్రయిస్తున్నారు.

 


 బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని ధర కూడా పెరుగుతూ పోతుండడం గమనార్హం. ఢిల్లీ బ్లాక్ మార్కెట్లో నిన్న మొన్నటి వరకు దీని ధర రూ. 15 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ. 35 వేలకు చేరుకోవడం చూస్తుంటే అక్రమార్కులు ఎలా చెలరేగిపోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. యాంటీ వైరల్‌ ఔషధం రెమిడెసివిర్‌ను భారత్‌లో మార్కెటింగ్‌ చేసేందుకు అమెరికా ఔషధ దిగ్గజం గిలీడ్‌ సైన్సెస్‌కు మన దేశ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింన విష‌యం తెలిసిందే.  ఈ మందును ఆసుపత్రిపాలైన కొవిడ్‌-19 రోగులకు ‘పరిమితస్థాయిలో అత్యవసరంగా’ వినియోగించేందుకు సమ్మతించింది. గరిష్ఠంగా ఐదు రోజుల పాటు ఈ ఔషధాన్ని ఇవ్వాలని స్పష్టంచేసినట్లు వివరించాయి.

 


అమెరికాలో ప్రయోగాత్మక దశలో విజయవంతం అయిన రెమ్‌డెసివిర్‌ను దేశంలో వాణిజ్యపరంగా పంపిణీకి ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెటిరో కాంట్రాక్టు పొందింది.  అయితే ఈ ఔష‌ధం విక్ర‌యాల‌పై ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మెడిక‌ల్ స్టోర్ల యజ‌మానులు దోచుకుంటున్నారు. దక్షిణ, తూర్పు దిల్లీ, గురుగ్రామ్‌లో బ్లాక్‌మార్కెట్‌లో రెమిడెసివిర్‌ లభ్యమవుతోందని, అధీకృత డీలర్ల వద్ద మాత్రం లేదని తెలిపారు. ఇలాంటి కీలకమైన ఔషధాల ధరను కట్టడి చేయడానికి దేశంలో సమర్థ యంత్రాంగం లేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: