దేశంలో మ‌ళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌కు పౌర స‌మాజం నుంచి డిమాండ్ వ‌స్తోంది. అయితే అందుకు కొన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు సంసిద్ధ‌త వ్య‌క్తం చేస్తూ అమ‌లుకు ఆదేశాలిస్తుండ‌గా మ‌రికొన్ని మాత్రం లాక్‌డౌన్తో పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌ని ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని వాదిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం వాద‌న కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగితే మ‌హ‌మ్మారిని అరిక‌ట్టగ‌ల‌మ‌ని చెబుతోంది. ఇదిలా ఉండ‌గా దేశంలో మాత్రం కరోనా కేసులు రోజు రోజుకు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి.లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన నాటి నుంచి ఈసంఖ్య అనుహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ బాట పట్టాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ విధించారు.

 


కర్ణాటకలోని బెంగళూరులో ఈనెల 14 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధించారు. పదిరోజులపాటు ప్రజలెవరూ కూడా బయటకు రాకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, కిరాణా షాపులు, పండ్లు, కూరగాయల షాపులు తెరిచి ఉంటాయి.. ఇక, షెడ్యూల్ చేయబడిన వైద్య మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈశాన్య రాష్ట్ర‌మైన నాగాలాండ్ కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ ను విధించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.  మేఘాలయ రాష్ట్రంలో జులై 13, 14వ తేదీల్లో రాష్ట్రం రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ కానున్నది. ఈ రెండు రోజులు ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు.

 


 అటు మహారాష్ట్రలో కూడా జులై 31 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నది. ఝార్ఖండ్ లో జులై 31 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నది. హోటల్స్, సెలూన్స్, రెస్టారెంట్స్, ప్రార్ధన మందిరాలను కూడా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జులై 31 వరకు లాక్ డౌన్ విధించారు.జులై 10 వ తేదీ నుంచే ఉత్తర ప్రదేశ్ లో మళ్ళీ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.  కరోనా వైరస్ కేసులు ఉధృతి నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: