ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఖ‌మ్మం జిల్లా కేంద్రంతో పాటు కూసుమంచి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, మ‌ధిర‌, స‌త్తుప‌ల్లి, నేల‌కొండ‌ప‌ల్లి, ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లాల్లో పాజిటివ్ కేసులు న‌మోదవుతుండ‌గా, భ‌ద్రాద్రి జిల్లాల్లో ఇల్లందు, కొత్త‌గూడెం, పాల్వంచ‌,భ‌ద్రాచ‌లం,పిన‌పాక‌, మ‌ణుగూరు, జూలూరుపాడు, చుండ్రుగొండ మండ‌లాల్లో కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవ‌డానికి అటు పాల‌కుల ఉదాసీన‌త‌, అధికారుల నిర్ల‌క్ష్యం ఇటు ప్ర‌జ‌ల స్వీయ బాధ్య‌తారాహిత్యం తోడ‌వుతున్నాయి. జ‌నాలు కుప్ప‌లు కుప్ప‌లుగా రోడ్ల మీద‌కు వ‌చ్చేస్తున్నారు.

 

 హైద‌రాబాద్ లింకుల‌తో గ‌తంలో ఎక్కువ‌గా కేసులు న‌మోదు కాగా..ప్ర‌స్తుతం లోక‌ల్ కాంటాక్టుల‌తోనే పాజిటివ్ కేసుల న‌మోదు పెరుగుతున్న‌ట్లుగా వైద్య వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామ రెండు జిల్లాల ప్ర‌జానీకాన్ని, అధికార‌యంత్రాంగాన్ని ఆందోళ‌నకు గురి చేస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 169 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 57 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.వాస్త‌వానికి  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఒక‌ట్రెండు కేసులు న‌మోదైన‌ప్పుడు అటు అధికారులు గాని, ఇటు ప్ర‌జాప్ర‌తినిధులుగాని తెగ హ‌డావుడి చేశారు.ఇప్పుడు కేసుల సంఖ్య ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


 పాజిటివ్ కేసులు నమోదైన ఏరియాల్లో రోజూ బ్లీచింగ్ చ‌ల్లించాల్సి ఉండ‌గా ఏదో మ‌మ అనిపిస్తున్నారు. చిన్న‌చిన్న ఫంక్ష‌న్ల‌కు కూడా అధికారులు ఎలాంటి అభ్యంత‌రం తెల‌ప‌కుండా అనుమ‌తులిచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫంక్ష‌న్ల నిర్వ‌హ‌ణ‌పై సిబ్బందితో ప‌ర్యేవేక్షించాల్సి ఉన్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఖమ్మంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృత‌మైన నేప‌థ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి  సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కే దుకాణాల‌ను తెరిచి ఉంచాల‌ని జిల్లా ప‌ట్ట‌ణ‌ క్లాత్ అండ్ రెడిమేట్ దుకాణాల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు నిర్ణ‌యించుకుంది. అసోసియేష‌న్ స‌భ్యులు ఆదివారం తీర్మానించుకున్నారు. అంత‌కు రెండు రోజుల ముందు క‌రోనా వైర‌స్‌తో ఖ‌మ్మం గాంధీచౌక్‌లోని ఇద్ద‌రు కిరాణ వ‌ర్త‌క వ్యాపారులు నాలుగు రోజుల కింద‌ట మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: