క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఈనెల 31వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ ఇచ్చిన పిలుపును రాష్ట్ర ప్ర‌జానీకం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూను విజ‌య‌వంతం చేసిన ప్ర‌జ‌లు సోమ‌వారం మాత్రం పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి చేరుకుంటూ త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకుంటున్నారు. ఇక ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లుగా  ప్రైవేటు సంస్థ‌లేవీ బంద్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లుగా చేస్తే త‌మ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ‌తినే ప్ర‌మాద‌ముంద‌ని నిర్వాహాకులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌న‌సంచారంతోనే వైర‌స్ వ్యాప్తి అధిక‌మ‌వుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. 

 

ప్ర‌జార‌వాణాను ఇప్ప‌టికే ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం..ప్రైవేటు వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌ద‌ని సూచించింది. అయితే వాస్త‌వంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.  పలు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా జనాలు తిరుగుతున్నారు. ప్రైవేటు బస్సులు, ఆటోలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఒక్కో వాహనంపై ముగ్గురు, నలుగురు తిరుగుతున్నారు. ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్ లాంటి కొన్ని జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులే లేరు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో పూర్తి స్థాయి నియంత్రణ అవసరమని, స్వీయ నియంత్రణలో జనం ఉండాలని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెప్తున్నా.. జనం మాత్రం ఏమీ పట్టనట్టే రోడ్ల మీదే తిరుగుతున్నారు. 

 

ఇలా జ‌న‌సంచారం పెరిగితే వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌డం అసాధ్య‌మ‌ని వైద్యులు ఆదోంళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.   అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలు, ప్రజాసేవ విభాగంలోని సిబ్బందికి మాత్రమే అనుమతి ఇవ్వ‌గా ఇవే కార‌ణాల‌ను చెబుతూ కొందరు నగరవాసులు దుర్వినియోగం చేస్తున్నారు.కనిపించని శత్రువుతో పోరాటానికి బెంబేలెత్తి దేశాధినేతలే చేతులెత్తేస్తుంటే... జనం ఇలా చేయడం ఎంత వరకు సబబని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని పిలుపునిస్తున్నారు.  జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోయేది జనమేనని హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: