మధుమేహం వచ్చింది. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు మందులు వాడమనీ, వ్యాయామం చేయమనీ వైద్యులు చెప్పారు. వంట చేసేటప్పుడు ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా.. సలహా ఇవ్వండి.

మధుమేహానికీ.. ఆహారపుటలవాట్లకూ చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంటకు ఉపయోగించే నూనెల్ని గడ్డకట్టిన స్థితిలో కాకుండా గది ఉష్ణోగ్రతలో.. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాడాలి. వనస్పతీ, నెయ్యి వంటివి పూర్తిగా మానేయాలి. కనోలా, ఆలివ్‌, గ్రేప్‌సీడ్‌ నూనెల్ని ఎంచుకోవడం మంచిది. కొవ్వుశాతం కలిగిన పాలనే ఎంచుకోవాలి. పెరుగు కూడా కొవ్వులేని పాలతోనే చేసుకోవాలి. సాధారణ పనీర్‌కి బదులు సోయా పనీర్‌ని ఎంచుకోవాలి.

బేకరీ పదార్థాలు చేసేప్పుడు వెన్నలాంటి కొవ్వు పదార్థాలకు బదులు యాపిల్‌సాస్‌నీ... చాక్లెట్‌చిప్స్‌కి బదులు కోకో పౌడర్‌నీ ఎంచుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం మానేయాలి. వేపుడు కూరలను నీళ్లలో లేదా ఆవిరిపై ఉడికించి... తరవాత తక్కువ నూనెలో వేయించుకోవాలి. ఉడికించడం, గ్రిల్‌, బేకింగ్‌ పద్ధతుల్లో పదార్థాలను వండుకోవాలి. మాంసాహారులైతే చికెన్‌ చర్మాన్ని తొలగించి ఆ తరవాత వండుకోవాలి. మాంసాహారం వండుతున్నప్పుడు కనిపించే కొవ్వుని తొలగించాలి.

వండేటప్పుడు పైకి తేలే నురగునీ ఎప్పటికప్పుడు తీసేస్తే కొవ్వు శాతం తగ్గుతుంది. వండిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచితే కొవ్వు పైకి తేలి గట్టిపడుతుంది. అప్పుడు దాన్ని సులభంగా తీసేయొచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తపోటు వచ్చే అవకాశాలూ ఎక్కువ కాబట్టి ఉప్పూకారాల వినియోగాన్నీ తగ్గించుకోవాలి.

బదులుగా కొత్తిమీరా, పుదీనా, కసూరి మేథీ, దాల్చినచెక్క పొడీ, యాలకులపొడీ, సోంపు పొడీ, నిమ్మరసం, మామిడి, ఉసిరిపొడి లాంటివి వేసుకోవచ్చు. వీటిలో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. భోంచేశాక తీపి తినే అలవాటున్న వారు దానికి బదులుగా బొప్పాయీ, జామ, పుచ్చకాయ, బత్తాయీ, యాపిల్‌ లాంటివి ఎంచుకోవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: