ఆరోగ్యం కోసం పండ్లలో రసాయనాలు కలిపి కత్రిమ పద్ధతులలో పండించి అమ్మే వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ వ్యాఖ్యానించింది. న్యాయస్దానం వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్ననాటి ప్రభుత్వం పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టి, మామిడి పండ్లని కాల్షియం కార్బైడ్‌ అనే హానికర రసాయనంతో పక్వానికి వచ్చేటట్లు చేస్తున్నారని గుర్తించారు. ఈ రసాయనం నీటితో కలిపితే ఎసిటిలిన్‌ ఉత్పత్తి అవుతుంది.
ఈ హానికర రసాయనంతో పండిన పండ్లను తింటే ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. వాంతులు, విరోచనాలతో బాధపడే, అవకాశాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరించడంతో, ప్రభుత్వం కాల్షియం కార్బైడ్‌ వినియోగాన్ని నిషేధించింది. ఈ రసాయానాన్నే కాకుండా ఇథిలిన్‌, ఇథిఫాన్‌ వంటి వాటిని కూడా కాయలు పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంటారు. ఫలితంగా పండ్లు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. మామిడిపండ్లలోనే కాకుండా బొప్పాయి, అరటి, ఆపిల్‌, సపోట, బత్తాయి వంటి కాయలు త్వరగా పక్వానికి రావడానికి రసాయనాలను వాడుతున్నారు.
 విశాఖ మన్యంలో.... 
ఇపుడు తాజాగా విశాఖ మన్యంలో గత రెండేండ్లుగా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న స్ట్రాబెర్రీ పండ్లలో కూడా రసాయనాలు వాడుతున్నట్టు ఆ ప్రాంతంలోని కొందరు గిరిజన రైతులు అంటున్నారు.
రుచి ఉండవు...
 '' చింతపల్లి,లరకు ప్రాంతంలో దాదాపు 20 ఎకరాల్లో స్ట్రాబెర్రీలు పండిస్తున్నారు. ఎకరానికి 25వేల మొక్కలు పెంచుతున్నారు. కొందరు రైతులు, పూత దశలో, కాయ దశలో రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. కత్రిమ పద్ధతిలో పండించిన పండ్లు ఆకర్షణీయంగా, ఒకే సైజులో, ఒకే ఆకారంలో ఉంటాయి, కానీ రుచిగా ఉండవు. త్వరగా దిగుబడి వస్తుంది. '' అని చింతపల్లికి చెందిన ఒక రైతు మాతో అన్నాడు.

 సేంద్రియ పద్దతిలో పండిస్తున్నాం...

 స్ట్రా బెర్రీ సాగులో రసాయనాలు వాడటం అనే అరోపణలు నిజం కాదంటున్నారు మరికొందరు రైతులు. '' ఎలాంటి రసాయనాలు వాడకుండా , పూర్తిగా సేంద్రియ పద్దతిలో మాత్రమే స్ట్రా బెర్రీ సాగు చేస్తున్నాం. మేం పండించిన పండ్లను ఎవరైనా పరీక్షించుకోవచ్చు. అనేక కష్ఠాలు, నష్టాలు భరించి ఒక ప్రయోగాత్మకంగా మన్యంలో ఈ పంటను వేసి సక్సెస్‌ అయ్యాం. ఇలాంటి ఆరోపణల వల్ల మా రైతుల్లో ఆత్మస్ధయిర్యం దెబ్బతింటుంది. ఈ సాగులో ఎకరానికి లక్షరూపాయలు వరకు పెట్టుబడి అవుతోంది. పెద్దగా లాభాలు రాలేదు... అయినప్పటికీ మన్యం బెర్రీలకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలనే లక్ష్యంతో సాగు చేస్తున్నాం..'' అని చింతపల్లిలో తేజా స్ట్రాబెర్రీ ఫాం కి చెందిన శివ, భాస్కర్‌ రాజు అంటున్నారు. 

ఆంధ్రా స్ట్రాబెర్రీలు గా ఇటీవల గుర్తింపు పొంది,జాతీయ మార్కెట్లను ఆకర్షిస్తున్న మన్యం స్ట్రాబెర్రీ ల పై వస్తున్న ఆరోపణల మీద వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టి వాస్తవాలు వినియోగదారులకు వెల్లడి చేయాల్సిన అవపరం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: