మహిళలు వాడే, శానిటరీ ప్యాడ్‌లను సింథటిక్‌, ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వాటిని ఎక్కువసేపు ఉంచడం రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇపుడు అమెరికాలో పెరిగే చెట్ల బెరడు తో హైదరాబాద్‌లో ప్యాడ్‌లు తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో దొరికే ప్యాడ్‌లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి, ఈ కొత్త తరహా ప్యాడ్‌లు మాత్రం భూమిలో తొందరగా కలిసిపోతాయి.' అని, ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్న షైన్‌ స్యచ్ఛంద సంస్థ వ్యవస్ధాపకురాలు చదురుపల్లి పరమేశ్వరి చెపుతున్నారు.

 కొందరు పొయ్యిలో బూడిదను వాడుతున్నారు...

 నల్గొండ,రంగారెడ్డి ,మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి రుతుక్రమం సమయంలో అక్కడి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరమేశ్వరి పరిశీలించినపుడు భయంకరమైన విషయాలు తెలిశాయన్నారు. '' మహబూబ్‌ నగర్‌ సమీపంలో మారు మూల పల్లె మహిళలు 'ఆ సమయంలో...' జనప నారను వాడటం చూశాం. నల్ల మల అటవీ ప్రాంతం దేవరకొండలో అయితే, కట్టెల పొయ్యిలోని బూడిదను పాతబట్టలో పెట్టి వాడుతున్నారు. దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు. '' అన్నారు పరమేశ్వరి. పేదరికం వల్ల వాడకం తక్కువ రుతుస్రావ సమయంలో ప్యాడ్స్‌ వాడక పోవడానికి కారణం ,ఆర్దిక పరిస్థితులు, అందుబాటు ధరల్లో లభ్యం కాకపోవడం, ఆరోగ్యం పై అవగాహన లేకపోవడం అని గమనించిన ఆమె ప్యాడ్‌ల వాడకం పై అవగాహన కల్పించడం కోసం అనేక గ్రామాలు తిరిగారు. తాము తయారు చేసిన వాటిని స్థానిక విద్యార్థినులకూ, చుట్టుపక్కల మహిళలకు ఉచితంగా అందజేశారు. 

అమెరికా నుండి దిగుమతి 

మహిళారోగ్యానికి రక్షణ.. పర్యావరణానికి మేలు.. అనే రెండు లక్ష్యాలతో కేంద్ర ఐటీ శాఖ చేపట్టిన పథకం, స్త్రీ స్వాభిమాన్‌. దీనిలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇండియాలో తొలిసారిగా ఎకోఫ్రెండ్లీ ప్యాడ్స్‌ తయారీని, షైన్‌ ఎన్జీఓ ద్వారా అమలు చేయగా ,విజయవంతమవ్వడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ పథకం కింద ప్యాడ్‌ల తయారీ ప్రారంభించారు. ఐటీ శాఖ అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జును రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌ లో' షైన్‌' సంస్ధకు పంపిస్తారు. అక్కడ 8 దశల్లో వుడ్‌పల్ప్‌ను ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా హ్యాండ్‌ మేడ్‌గా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ నెలకు 40 నుండి 50వేల ప్యాడ్స్‌ని ఉత్పత్తి చేసి గ్రామాలకు పంపుతున్నారు. 

అందరికీ అందుబాటు ధరలో...

 మార్కెట్‌లో దొరికే ఇతర రకాల శానిటరీ న్యాప్కిన్లకు ఎక్కువ ధరే ఉంది. పేద మహిళలందరికీ అందుబాటులో ఉండేలా ఎనిమిది ప్యాడ్‌ల ప్యాక్‌ను రూ.28కే వీరు అందజేస్తున్నారు. '' రుతు స్రావం విషయంలో సిగ్గుపడకుండా అవగాహన పెంచుకోవాలి. మనదేశంలో ప్రతీ ఏడు నిముషాలకు ఒక మహిళ సెర్వికల్‌ క్యాన్సర్‌ని బారిన పడుతున్నారు. యవ్వన దశ నుండీ ప్రారంభమయ్యే నెలసరి గురించి తప్పని సరిగా అవగాహన కలిగి ఉంటే సెర్వికల్‌ క్యాన్సర్‌ని నివారించవచ్చు. ...'' అంటారు పరమేశ్వరి. ఈ సానిటరీ ఫ్యాడ్ప్‌ గురించి మరిన్ని వివరాలకు పరమేశ్వరి గారిని( ఫోన్‌ నెంబర్‌. 9347738490 ) సంప్రదించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: