ఆధునిక జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న , ఒత్తిళ్లూ, భయాలూ, అభద్రతలూ లాంటి సమస్త సవాళ్లను అధిగమించడానికి, గొప్ప మార్గం 'యోగ నిద్ర' వ్యాపారం, ఉద్యోగాల్లో ఒత్తిడి - అంతులేని లక్ష్యాలూ పదోన్నతుల ప్రయత్నాలూ ఉనికి కోసం పాట్లూ. కుటుంబ జీవితంలో ఒత్తిడి, అధిక రక్తపోట్లూ నిద్రలేమి సమస్యలూ, ఒకటేమిటి, దాదాపు 75 శాతం వ్యాధులకు మనసే కారణమని అంటారు.

దాదాపు 40 శాతం ప్రజలు ఏదో ఓ సమయంలో డిప్రెషన్‌ బారిన పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ...మనోశక్తిని పెంచుకోడానికి మహర్షులు ఓ మహత్తరమైన మార్గాన్ని చూపించారు. అదే, 'యోగనిద్ర'. 

యోగ నిద్ర సులభమైన ప్రక్రియ. తలకిందా, కాళ్లుపైనా చేసి శీర్షాసనాలు వేయాల్సిన పన్లేదు. ముక్కుమూసుకుని ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం లేదు. ఖరీదైన వ్యాయామ పరికరాలతో పనేలేదు. కొరుకుడుపడని పదజాలాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. తొలిదశలో అనుభవజ్ఞుడ్కెన యోగాచార్యుడి దిశానిర్దేశం ఉంటే సరిపోతుంది. ఆతర్వాత సొంతంగా అయినా సాధన చేసుకోవచ్చు. 

భారతీయత యోగనిద్రకు దైవత్వాన్నిచ్చింది.
ఆదిశంకరుడు తన 'తారావళి'లో యోగనిద్ర ప్రశస్తిని వివరించాడు - 'ఆ స్థితిలో మాయ కరిగిపోతుంది.
అహం అంతరిస్తుంది. ఇంద్రియాలకూ మనసుకూ మధ్య సంబంధం తెగిపోతుంది. యోగులు అనుభవించే ఆ దివ్య చైతన్యమే యోగనిద్ర'. ఆధునిక యుగంలో స్వామి సత్యానంద సరస్వతి, స్వామి రామ తదితరులు యోగనిద్రకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: