మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..? 
ఉదయం పూట, పరగడపున... హాయిగా - ప్రశాంతంగా.. విశ్రాంతిగా శవాసనంలో పడుకోవాలి. ఒంట్లోని అన్ని భాగాలూ దేనికదే స్వతంత్రంగా సేదతీరాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఏ ఒక్క భాగం మీదా ప్రత్యేకించి ఒత్తిడి ఉండకూడదు. వస్త్రధారణ అసౌకర్యంగా అనిపించకూడదు. బలవంతంగా రెప్పవాలుస్తున్నట్టు కాకుండా, ప్రశాంతంగా కళ్లు మూసుకోవాలి. యోగనిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు.

 యోగనిద్రలో తొలి అడుగుగా... శరీరం లోపలి నుంచీ, ఇంట్లోంచీ, వీధిలోంచీ స్పష్టంగానో అస్పష్టంగానో వినిపిస్తున్న శబ్దాల్ని గమనించాలి. ఆ శబ్దాలే మనకు కావాలి, వాటి మూలాలూ కారణాలూ అక్కర్లేదు. అలా అని, ఒకే శబ్దాన్ని పట్టుకు వేలాడకూడదు. ఒకటి కాగానే మరొకటి, మరొకటి కాగానే ఇంకొకటి - దగ్గర, దూరం, ఇంకాస్త దూరం, మరికాస్త దూరం. ఈ సాధన వల్ల మనసు అలసిపోతుంది, బాహ్య విషయాల మీద ఆసక్తిని కోల్పోతుంది.

క్రమక్రమంగా మనసును ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లాలి. అంటే ఏ ఆలోచననీ ప్రయత్నపూర్వకంగా లోపలికి తీసుకోకూడదు, ఉద్దేశపూర్వకంగా కొనసాగించకూడదు, బలవంతంగా తొక్కిపెట్టనూకూడదు. వచ్చే ఆలోచనలు వస్తుంటాయి. వెళ్లే ఆలోచనలు వెళ్తుంటాయి. సినిమా థియేటర్‌లో ప్రేక్షకుడిలా గమనిస్తూ ఉండటమే. ఈ సాధన ద్వారా... ఏం ఆలోచించాలో, ఏం ఆలోచించకూడదో, ఆలోచిస్తే ఎంతమోతాదులో ఆలోచించాలో, ఎప్పుడు ఆలోచించాలో కూడా మనమే నిర్ణయించుకునే శక్తి అలవడుతుంది.

శ్వాస మీద ధ్యాస చాలా ముఖ్యం. గాలి లోపలికెళ్తున్న మార్గాన్నీ బయటికొస్తున్న తీరునూ పరిశీలిస్తూ ఉండాలి. ఆ సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో కలిగే స్పందనల్ని గమనించాలి. 'నేను పవిత్రతను లోపలికి తీసుకుంటున్నాను. అపవిత్రతను వదిలిపెడుతున్నారు. నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతను వదిలిపెడుతున్నాను. ' అన్న భావన మీలో కలగాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: