ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద సున్నితమైన సమస్య మనిషి తాను సౌలభ్యంగా, సావకాశంగా పెంచి పోషించుకుంటూ వస్తున్న కొవ్వు.  రోజు వారి ఒత్తిడిలో సమయం, సందర్భం లేకుండా మనల్ని చంపేసే చక్కటి, చిక్కటి కొవ్వును అతిగా తీసుకోవడం మనలో దాదాపుగా ప్రతిఒక్కరి అలవాటు. ఆ అలవాటును ఓ చక్కటి రోజున గుండెపోటు రూపంలో మనల్ని గగుర్పాటు చేస్తుందనడంలో సందేహంలేదు.  రేపెప్పుడో మనకేదో జరుగుతుందని ఈ రోజు కంగారుపడడం ఎందుకని వాదించే వారికే ఈ విశ్లేషణ.

మన తాతల తరం వాళ్ళు తినే ఆహార అలవాట్లు మార్చుకుంటే మనలో కొవ్వు కరిగిపోతుందా...లేక బజారులో దొరికే చౌకబారు మందులు వల్లనో, లేక టీవిలో సన్నగా నాజూగ్గా కనిపించి చూపించే సుందరీమణుల బెల్టుల వల్లనో తగ్గుతుందా... ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైనా అనుభవపూర్వకంగానే చెప్పాలి.  నాలిక మీద ప్రేమతో పెంచుకున్న నాజూకు కొవ్వు అంత తొందరగా తగ్గుద్దా... అందుకే అంటారు పెద్దలు ఎదైనా మితంగా తినాలని. ఏం తిన్నా, ఎలా తిన్నా ఆరోగ్యంగా వుండాలంటే వ్యాయామం తప్పనిసరి అని రోజుకు కనీసం ఒక్కసారైనా మనం వింటూనేవుంటాం అలా విని యథాపలంగా వదిలేస్తూవుంటాం కూడా.   కాని వ్యాయామం వల్ల ఎన్నో ఉపయోగాలున్నది అక్షరసత్యం.  వ్యాయామాల్లో చాలా ప్రక్రియలే వున్నాయి.  కాని మన పూర్వీకులు వ్యాయామంలో యోగ అన్న ప్రక్రియను కనుగొని మనకు ప్రసాదించారు.  ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.

యోగ పుట్టుక భారతదేశమే అయినా ప్రపంచం నలుమూలలా అతిత్వరగా విస్తరించింది.  అంతే కాదు యోగ డే పేరుతో జూన్ 21న జరుపుకోవడం మరింత విశేషం.  ఈ యోగ డే 2015 సంవత్సరం నుండి ప్రారంభమైంది. దీని వెనుక మన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడి గారి కృషి చాలానే వుంది.  ఇదంతా పక్కన పెడితే మామూలుగా యోగ చేయమనడం కాదు కనీసం చూడమని అన్నా కనీసం చుట్టపు చూపు కూడా మరల్చడానికి ఇష్టపడని మన పుష్టి వీరులు ఇక యోగ డే కి ఏమి విలువిస్తారో ఆర్ధం చేసుకోవచ్చు.  బరువు మీటర్లు చూసుకొని, భారీగా కిలోమీటర్లు పరిగెత్తినా లేక జిగేల్ మనే డ్రస్సులతో జిమ్ములకు వెళ్లి జిమ్మీజిక్కులు చేసినా ఇంటికొచ్చాక పెరిగేది చెమట తప్ప ఇంకేంలేదు.

అద్భుతమైన యోగాసనాలు రోజుకు కనీసం అర్ధగంట చేస్తే మానసిక ఉల్లాసంతోపాటు మనిషికి ఆరోగ్యం.  యోగ లో ఓ మంచి పాయింటు వుంది గమనించండి.  యోగసనాలలో ఫోన్ ఉపయోగించలేం కాని జిమ్ లలో మరింకేదైనా ప్రక్రియలో ముందు ఫోనే చూస్తాం. ఇక్కడ ఫోన్ గురించి ఎందుకు చెప్పానో మీకు ఈపాటికి అర్ధం అయ్యేవుంటుంది.  ఏదేమైనప్పటికీ మన పూర్వీకులు మనకందించిన ఈ అద్భత యోగ ప్రక్రియను అందరికీ అర్ధమయ్యేలా మనమూ చెబుదాం. అందుకే ఆరోగ్యం కోసం పాకులాడే యోగుల్లారా యోగ చేసి యోగాయోగ్యులవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి: