ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది డాక్టర్లు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాత అత్యధిక సంఖ్యలో డాక్టర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ కౌన్సిళ్ల దగ్గర నమోదైన పేర్ల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.

 

దేశంలో వైద్యుల కొరతపై శుక్రవారం లోక్‌సభలో అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వనీకుమార్‌ చౌబే ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం దేశంలో ప్రస్తుతం 11.57 లక్షల మంది నమోదిత డాక్టర్లు ఉన్నారు. అందులో 80%మంది మాత్రమే క్రియాశీలకంగా వైద్యవృత్తిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

 

దాని ప్రకారం 9.26 లక్షల మంది డాక్టర్లు వైద్యసేవలకు అందుబాటులో ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం దేశ జనాభాను 135 కోట్లుగా పరిగణిస్తే దేశంలో ప్రతి 1,457 మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రతి వెయ్యిమందికి ఒక డాక్టర్‌ ఉండాలన్న డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంతో పోలిస్తే దేశంలో డాక్టర్ల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లే లెక్క. వీరికితోడు 7.88 లక్షల మంది ఆయుష్‌ డాక్టర్లు ఉన్నారు.

 

ఇందులో 80% మంది మాత్రమే వైద్యసేవలకు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం భావిస్తోంది. డాక్టర్ల కొరతను తగ్గించడానికి ఎంబీబీఎస్‌ సీట్లను పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. దీనికితోడు వైద్య కళాశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలను సడలించినట్లు తెలిపింది. జిల్లా ఆసుపత్రులకు అనుగుణంగా కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. పీజీ సీట్ల భర్తీ విషయంలోనూ నిబంధనలను సడలించినట్లు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: