ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతులు పొలం పనుల్లో బిజీ అయిపోతారు. కానీ శ్రీకాకులం, కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతాల్లోని రైతులు పొలానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కలుపు మొక్కలు కంటే పాములే ఎక్కువ ఉండడంతో వణికిపోతున్నారు. పనులకు వెళ్తే పొలం నుంచి ప్రాణాలతో వస్తామా.. అనే భయంతో గుమ్మం దాటడంలేదు.

 

పిచ్చి మొక్కలు తొలగిస్తేనే నాట్లు వేసేది. కానీ పొలం వెళ్తే పాము కాటుకు బలికావాల్సిందేనని రైతులు పొలానికి వెళ్లట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి 18 మంది చనిపోయారు. వర్షాలు పడి పుట్టల్లోకి నీరు చేరడంతో అవి పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు నోటీసు బోర్డులు పెట్టారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కృష్ణా జిల్లా దివిసీమలో రైతులపై కక్ష గట్టినట్టు పాములు కాటేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దివీసీమలో 2017 లో 460 మంది, 2018 లో 580 మంది పాము కాట్లకు గురయ్యారు. దివిసీమలో దొరికే అరుదైన కప్పలను కొందరు స్థానికులు పట్టుకుని విదేశాలకు అప్పగిస్తున్నారు. దీంతో ఇవి ఆహారం కోసం ఊళ్ళ మీద పడుతున్నాయి. కప్పల కోసం జనవసాల్లోకి, ఎలుకల కోసం పొలాల్లోకి పాములు వచ్చేస్తున్నాయి.  బుల్ ఫ్రాగ్, బున్యన్ స్కిప్పర్, ఎల్లో ఇండియన్ ఫ్రాగ్, సదరన్ క్రికెట్ ఫ్రాగ్.. వంటి అరుదైన జాతులకు విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో కొందరు వీటిని వెతికి మరీ పట్టుకుంటున్నారు. దీంతో మనుషుల వల్ల పాములకు, పాముల వల్ల మనుషులకూ ముప్పు ఏర్పడింది. కొందరు పాములను వెతికిమరీ చంపేస్తున్నారు. 

 

దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. పాములను చంపేస్తే మనవజాతికే ప్రమాదమంటున్నారు. పొలాల్లో ఎలుకలను నివారించాలంటే పాములు అవసరమని ఎలుకలను నిర్మూలించటం వాటితోనే సాధ్యమంటున్నారు. ప్రకృతిలో సమతుల్యం దెబ్బతింటేనే ఇలాంటి విపత్తులు వస్తాయని అంటున్నారు. ముందు మనుషులు చేస్తున్న అక్రమాలు అరికట్టాలని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: