ఆషాడ మాసం.. ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు.  ఆది అంటే శక్తి అని అర్థం. పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు.  అలాగే ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం ఆనాదిగా ప్ర‌బ‌లంగా ఉంది. గోళ్ల‌కు రంగును క‌లిగించే గోరింటాకు `` న‌ఖ‌రంజిని`` అని పేరు. 


ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే... జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటించలేరు.


అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. గోరింటాకునకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషధ‌ గుణం కలిగి ఉంది.బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి శ‌రీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 


పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే ! దీని వ‌ల్ల శ‌రీరంపై ఉన్న అలెర్జీలకు దూరం చేసుకోవచ్చు. బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌) దరిచేరదు. పూర్వం నుంచి ఆట‌ల‌మ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని చెబుతారు. 


అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్ వేసుకుంటే.. జుట్టు బలపడి జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. 


గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు.గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: