వదులుగా మారిన ఎముకలను సరిచేసిన న్యూరాలజీ విభాగం ఆయన నిజాం వారసుడు..నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ నిజాం ఏడో మనమడు మిర్‌ ఇద్రత్‌ అలీఖాన్‌(54)కు నిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన పుట్టుకతో వచ్చిన 'ఆల్టియాంటో' అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఈ జబ్బు కారణంగా ఆయన మెదడు, వెన్నుకు కలిపే ఎముకలు వదులుగా మారి కుదించుకుపోయాయి.

కొంతకాలంగా అతడి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మెడ, వెన్నుకు సంబంధించిన నరాలు, ఎముకలు లోపభూయిష్టంగా మారడంతో శ్వాసకోశం, గుండె పనితీరు మందగించాయి. దీంతో రోగికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులను సంప్రదించినప్పటికీ ఫలితం దక్కలేదు.

దీంతో నిమ్స్‌లోని న్యూరాలజీ వైద్యులను కలిశారు. న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ విజయ సారథి రోగికి పరీక్షలు నిర్వహించి ఈ ఎముకలకు సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిర్‌ ఇద్రత్‌ అలీఖాన్‌కు సోమవారం సర్జరీ నిర్వహించి వదులుగా ఉన్న ఎముకలను సరిచేశారు.

నాలుగు గంటలపాటు జరిగిన ఈ సర్జరీలో డాక్టర్‌ విజయసారథితో పాటు వైద్యులు భవానీ ప్రసాద్‌, వసుంధర రంగన్‌, అలీ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఏడో నిజాం ఏర్పాటు చేసిన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో తనకు శస్త్రచికిత్స విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందని మిర్‌ ఇద్రత్‌అలీఖాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: