ఇప్పటి వరకు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకే పరిమితమైన అడవి దోమలు ఇప్పుడు హైదరాబాద్‌ జనం పై దాడులు చేస్తున్నాయి. వైద్యుల అంచనా ప్రకారం మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీ ఫారం(పీఎఫ్‌) సిటీలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు, 190కి పైగా మలేరియా కేసులు నమోదవగా, వీటిలో 150 మందిలో పీఎఫ్‌ లక్షణాలు కనిపించాయని అనధికారిక, సమాచారం. '' ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా మలేరియా సోకుతుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్‌(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం(పీఎఫ్‌) అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్‌ వ్యాపించినపుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది.

ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ ప్లాస్మోడియం పాల్సీఫారం మలేరియా చాలా ప్రమాదకరమైంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో కన్పించే ఈ జ్వరాలు.. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తున్నాయి.'' అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు విస్తరించడం, కొత్తగా ఫామ్‌హౌస్‌లు అందుబాటులోకి రావడం, నిర్మాణాలకి సంబంధించిన గుంతల్లో వరద నీరు చేరి నిల్వ ఉండటం, వాటి నిండా చెత్త పేరుకపోవడం వల్ల ఈ దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు నిపుణులు అంటున్నారు.

పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టి, దోమల నియంత్రణ చేపట్టాల్సిన బల్దియా చోద్యం చూస్తోంది. డెంగీ జ్వరాలు ప్రబలుతున్నా సరే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నివారణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

'' ప్లాస్మోడియం పాల్సీఫారం రకం మలేరియాను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్స అందించడంలో ఆలస్యమైతే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. దోమ కుట్టిన 14 రోజుల్లో జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మూడు రోజులు మించి ఉంటే వెంటనే వైద్యుడ్ని కలవాలి'' అని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: