గర్భవతులు తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, బరువు పై ప్రభావం చూపుతుంది. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, దీని వ‌ల్ల తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ తన మరియు తనలో పెరుగుతున్న బిడ్డ‌కు అవసరమైన పోషకాలు అందేలా పలు విధాలైన ఆహార పదార్థాలనుతినాలి. 


గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. 


గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి. 


కాఫీ టీ లాంటి కెఫిన్ కలిగిన పానీయాలను ఎక్కువగా తీసుకొంటే పిండం పెరుగుదల దెబ్బ తింటుంది. అందుకే వాటిని ఎక్కువగా తీసుకోరాదు. అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ, మామిడికాయ, ఆల్క‌హాల్‌, నువ్వులు, బొప్పాయి వంటివి తొలి నెలల్లో అంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: