భారత్ లో అరటిపండు వినియోగం అధికం. అరటి సాగు లోనూ దేశం ముందంజలో ఉంటుంది. పల్లెలూ, పట్టణాలూ అనే తేడా లేకుండా అనేక మంది అరటి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు వేల యాభై నాటికి భారత్ తో పాటు మరి కొన్ని దేశాలలో అరటి పంట పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్ లోని ఎక్సెటర్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు భారత్ లో అరటి ఉత్పత్తి క్షీణతకు దారితీయొచ్చునని వారు తాజా అధ్యయనంలో గుర్తించారు. ప్రపంచానికి 86 శాతం అరటిని అందిస్తున్న ఇరవై ఏడు దేశాలలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మారుతున్న వర్షపాతం ఉష్ణమండల పంట అయిన అరటిపై కీలక ప్రభావం చూపుతున్నాయని గుర్తించినట్టు వారు వెల్లడించారు.


ప్రపంచ వ్యాప్తంగా అధికంగా అరటి సాగు చేస్తున్న భారత్, బ్రెజిల్ తో పాటు మరో ఎనిమిది దేశాలలో వాతావరణ మార్పుల కారణంగా అరటి ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. పర్యావరణ మార్పులు ఇదే స్థాయిలో కొనసాగితే మరో ముప్పై ఏళ్లలో అరటి పంట పూర్తిగా మాయమైనా ఆశ్చర్యం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అరటి కుదుళ్లను నాశనం చేసే పనామా వ్యాధితో తోటలన్నీ నాశనమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పేదవాడి దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే పండు అరటి పండు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఎలాంటి రోగం ఉన్నా అరటిపండు మేలు చేస్తుందని అంటారు. ఇలా మేలు చేసే అరటిపండ్లు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.


ముఖ్యంగా క్యావెండిష్ అరటి, దీనికి ప్రపంచంలో మంచి గిరాకీ ఉంది. ప్రపంచంలో దాదాపు వెయ్యికి పైగా అరటి జాతులు ఉంటే అందులో మూడు వందల జాతులు మనిషి తినేందుకు అనువుగా ఉంటాయి, అందులోనూ క్యావెండిష్ అరటి ప్రత్యేకమైనది. అరటిపండు అన్నివేళలా అందరికీ ప్రియమైన మరియు చౌకైన ఫలం. కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటిపండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో చలామణి అవుతున్న ఫలం, దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా ఉన్నాయి. ఇది విరివిగా మరియు చౌక ధరలలో అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో లభిస్తున్నాయి.


అన్ని రకాల అరటిపండ్లలో ఏదో ఒక విధమైన లాభం చేకూర్చే గుణం ఉన్నాయి. అరటిపండు తీసుకుంటే తగు శక్తి సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. దీనిలో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో తక్షణం శక్తి నిచ్చే గుణముంది, ఇది సంవత్సరం పొడవునా దొరుకుతుంది. దీనిని మన జీవన విధానంలో చేర్చడం ద్వారా జీవక్రియలకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పొందవచ్చు. వంద గ్రాముల అరటిపండులో తొంభై క్యాలరీల శక్తి పది గ్రాముల ఫైబర్, పన్నెండు గ్రాముల షుగర్ ఉంటాయి.



జీవక్రియలకు ఉపయోగపడే పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది, దీనిలో విటమిన్ ఎ బి సి లు అత్యధికంగా ఉంటాయి. ఇందులో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు. పైగా అరటి నుంచి కావల్సినంత క్యాల్షియం ఐరన్ లభిస్తుంది. రక్తపోటును తగ్గించటంలో గుండె పని తీరును మెరుగు చేయడంలో ఉపయోగపడే మూలకాలలో ఒకటైన పొటాషియం ఈ అరటిపండులో అత్యధికంగా ఉంటుంది. ప్రపంచంలో దీనిని ఎక్కువగా సాగు చేస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: